
స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్‌కు మద్దతివ్వండి: ఎంపీ శశిథరూర్
కేరళలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసిన థరూర్, పార్లమెంట్ సమావేశాలను పక్కనబెట్టి స్వయంగా కేరళకు వెళ్లి ఓటు వేయనున్నట్లు చెప్పారు. మన పట్టణాలు, గ్రామాల్లో ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై రహదారులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఇతర సేవలపై పనిచేసే వారిని మనం ఎన్నుకోబోతున్నాం. డిసెంబర్ 9, 11 తేదీల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ఓటు వేసి, స్థానిక పాలనలో సార్థకమైన మార్పుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. గతంలో ఇక్కడ మూడు విడతలుగా జరిగేవి.
ఇదిలా ఉండగా కేరళలో రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) షెడ్యూల్‌ను ఒక వారం పాటు పొడిగించింది.
ఎన్నికల కమిషన్ ప్రకారం ఓటర్ల నమోదు గడువు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 18 వరకు పొడిగించారు. డిసెంబర్ 23న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అనంతరం జనవరి 22, 2026 వరకు అభ్యర్థనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితా ఫిబ్రవరి 14కు బదులు ఫిబ్రవరి 21, 2026న వెల్లడిస్తారని ఈసీఐ వెల్లడించింది. కేరళలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా, ఫారమ్‌లు నింపడం, దరఖాస్తులను పూర్తి చేసి ఇచ్చే పనులను వాయిదా వేయాలని, ఆయా అంశాలను పరిశీలించాల్సిందిగా ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే.
పుతిన్ తో విందుకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి ఉంటే బాగుండేది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు ప్రతిపక్ష నేతలు హాజరై ఉంటే ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమయ్యేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ హోదాలోనే తాను ఆ విందుకు హాజరయ్యానని థరూర్ వెల్లడించారు. నేను వివాదంలోకి వెళ్లాలనుకోవడం లేదు. మనలాంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలు కూడా అక్కడ ఉండి ఉండాలి. అది మంచి విషయం అయ్యేది. నేను నా బాధ్యతల మేరకు అక్కడ పాల్గొన్నాను. అక్కడ కొన్ని ఆసక్తికరమైన చర్చలు జరిగాయని ఆయన బెంగళూరులో మీడియాకు తెలిపారు. విదేశీ నేతలకు మర్యాదగా విందు ఏర్పాటు చేయడం మన సంప్రదాయం. రాష్ట్రపతి ఎంతో శ్రద్ధగా ప్రసంగించారు. పుతిన్ కూడా ఎంతో ఆప్యాయతతో స్పందించారు. భారీ రష్యా ప్రతినిధి బృందం, పలువురు ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉన్నారు.
