
‘స్థానిక’ వ్యూహంపై బీజేపీ చర్చ !
స్థానిక సంస్థల ఎన్నికలపై కాషాయపార్టీ కాస్త ఆలస్యంగానైనా దృష్టి సారించింది. ఈ ఎన్నికలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో ఇంతకాలం బీజేపీ కాస్త వెనకబడ్డట్టు కనిపించింది. జూబ్లిహల్స్ ఉప ఎన్నికల్లో, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. అయితే తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పదాధికారులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి వ్యూహాత్మక చర్చలు జరిగినట్టు సమాచారం.
హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలు మొదలైన అంశాలపై లోతైన చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి మార్గదర్శకత్వం
కిషన్ రెడ్డి పార్టీ నేతలకు స్థానిక ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో రామచందర్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బలమైన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను తిరస్కరించి బీజేపీకి మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని సూచించారు.
ఐక్యతను పెంచుకుందాం
తెలంగాణ బీజేపీలో ఇటీవల అంతర్గత విబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి సంబంధించిన నేతలంతా ఒక్కతాటిపైకి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాల్లో కొందరు నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో నేతలంతా ఐక్యంగా ఉండాలని రామచందర్ రావు సూచించడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలమెంత?
నిజానికి భారతీయ జనతాపార్టీ పట్టణ, నగర ప్రాంతాల్లో బలంగా ఉంటుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలంగా ఉండదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి వచ్చిన సీట్లు నామమాత్రమే. కేవలం హైదరాబాద్ నగరానికి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ పట్టు నిలుపుకోగలిగింది. దీంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ బయట ఏడు స్థానాల్లో బీజేపీ గెలుపొందడం.. ఎనిమిది ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకోవడంతో బీజేపీ నేతల్లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆయుధంగా చేసుకోవాలని చూస్తున్నది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి నేతలకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. వీరిద్దరే కాక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కూడా అక్కున చేర్చుకోవాలని బీజేపీ చూస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఉత్తరతెలంగాణ జిల్లాల్లోనూ బీజేపీకి పట్టుంది.
హడావుడి ఎక్కడ?
కొన్ని నెలలుగా తెలంగాణలో బీజేపీ పెద్దగా హడావుడి చేయకపోవడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గత సమస్యల మీదే దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు వివాదాస్పదంగా మారాయి. ఒక వేళ సుప్రీంకోర్టులో కేసు వేస్తే పరిస్థితి ఏమిటో తెలియదు. ఇందుకు సంబంధించిన గందరగోళం ఇప్పటికీ ఉంది.
బలోపేతానికి ఏం చేయాలి?
బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు తక్కువ. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పార్టీ జెండా దిమ్మెలు కూడా లేవని చెబుతుంటారు. కాబట్టి బీజేపీ వెంటనే గ్రామ కమిటీలను వేసుకోవాలి. ప్రజా సమస్యలపై కొట్లాడాలి. రాష్ట్ర స్థాయి నుంచి ఒక పిలుపువస్తే వెంటనే అన్ని గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరగాలి. పార్టీలో విపరీతమైన వర్గపోరు ఉంది. ఎప్పటినుంచో బీజేపీలో ఉన్న నేతలు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరిన నేతలు మధ్య సమన్వయం లేదు. వీరిని ఒక్కతాటి మీదకు తీసుకురావాలి. ఇందుకోసం అధిష్ఠానం చొరవ తీసుకొని ఒక కమిటీని వేయాల్సి ఉంది. ప్రజల నిజమైన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతుంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గణనీయమైన స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది.
