Let's talk: editor@tmv.in
స్థానిక కళలకు 'రైల్వే' బాసట.. స్టేషన్లే ఇక విక్రయ కేంద్రాలు

స్థానిక కళలకు 'రైల్వే' బాసట.. స్టేషన్లే ఇక విక్రయ కేంద్రాలు

Shaik Mohammad Shaffee
21 జనవరి, 2026

భారతీయ రైల్వే కేవలం ప్రయాణ సాధనంగానే కాకుండా దేశీయ కళలకు, స్థానిక ఉత్పత్తులకు గమ్యస్థానంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ (ఓఎస్‌ఓపీ)’ పథకం గ్రామీణ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రైల్వే స్టేషన్లను కేవలం రాకపోకల కేంద్రాలుగానే కాకుండా, స్థానిక ఉత్పత్తుల విక్రయ వేదికలుగా తీర్చిదిద్దడంతో వేలాది మంది చేతివృత్తిదారులకు నేరుగా విక్రయ అవకాశం లభిస్తోంది.

విస్తరిస్తున్న విక్రయ శోభ

2022లో ప్రారంభమైన ఈ పథకం, నేడు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరించింది. జనవరి 19, 2026 నాటికి అందిన అధికారిక లెక్కల ప్రకారం.. దేశంలోని 2,002 రైల్వే స్టేషన్లలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొత్తం 2,326 అవుట్‌లెట్లు నిరంతరం పని చేస్తూ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. రైల్వే శాఖ గణాంకాల ప్రకారం, ఈ విక్రయ కేంద్రాల ద్వారా దాదాపు 1.32 లక్షల మంది కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా ఉత్పత్తిదారులు నేరుగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు ఈ ఉత్పత్తులు నేరుగా చేరువవుతున్నాయి.

ఒక్కో ప్రాంతం.. ఒక్కో ప్రత్యేకత

భారతదేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ విక్రయ కేంద్రాలు వెలిశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో హస్తకళలు, వెదురుతో చేసిన అందమైన వస్తువులు, మట్టి పాత్రలు అలరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన స్వదేశీ మిఠాయిలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. రైల్వే నెట్‌వర్క్‌ను స్థానిక వారసత్వంతో ముడిపెట్టడం వల్ల ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా, సమగ్ర ఆర్థిక వృద్ధికి ఇది బాటలు వేస్తోంది.

వృత్తులకు పునర్జీవం.. 'లోకల్'కు దక్కిన గళం

అంతరించిపోతున్న ప్రాచీన కళలు, చేతివృత్తులకు ఈ పథకం సంజీవనిలా మారింది. సరైన విక్రయ వేదికలు లేక ప్రాభవం కోల్పోతున్న కళాకారులకు రైల్వే స్టేషన్లలో విజిబిలిటీ (గుర్తింపు) కల్పించడం ద్వారా వారి జీవనోపాధికి భరోసా లభించింది. ప్రభుత్వ 'వోకల్ ఫర్ లోకల్' నినాదానికి ఈ పథకం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. వాణిజ్యాన్ని సంస్కృతితో మిళితం చేస్తూ, రైల్వే స్టేషన్లను స్థానిక వ్యాపార కేంద్రాలుగా మార్చడంలో భారతీయ రైల్వే విజయవంతమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.