
స్థానిక ఎన్నికల తర్వాతే భూధార్ కార్డుల పంపిణీ: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో విధ్వంసమైన, కుప్పకూలిన అవినీతికి గురైన రెవెన్యూ వ్యవస్థను కేవలం రెండేండ్లలో ప్రజల సౌలభ్యానికి అనుగుణంగా పునర్నిర్మించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా భూభారతి విధానం ప్రకారం భూదార్ కార్డులను రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే, ఈ భూదార్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి పొంగులేటి వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా సమగ్ర డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నదని. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి మూడు శాఖలకు చెందిన సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందించే ప్రత్యేక అనువర్తనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి వ్యవస్థ స్థానంలో పూర్తిగా కొత్త డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసేందుకు ఎన్ఐసీ పనులు ముమ్మరం చేస్తున్నదని మంత్రి చెప్పారు.
రీసర్వే, భూధార్ నెంబర్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.29 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ నెంబర్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతున్నదని, నక్షాలు లేని 413 గ్రామాల్లో కీలక పనులు ప్రారంభించామని మంత్రి వివరించారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో రీ,సర్వే పూర్తి చేసి భూధార్ కార్డులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండవ విడతలో 373 గ్రామాల్లో రీసర్వేకు సన్నాహాలు జరుగుతున్నాయని, మూడవ విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్
రాష్ట్రంలో ఇప్పటి వరకు అందిన భూ సంబంధిత దరఖాస్తులలో అర్హమైనవన్నీ జనవరి నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని, అనంతరం ప్రత్యేక భూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీయడానికి ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ధరణిపై ప్రభుత్వం చేసిన కీలక చర్యలు
అధికారంలోకి వచ్చిన రోజున 2.45 లక్షల పెండింగ్ కేసులతో నిలిచిపోయిన ధరణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించామని, తదుపరి నెలల్లో మరో నాలుగు లక్షల దరఖాస్తులను కూడా ప్రజల సంతృప్తికి పరిష్కరించామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్‌ను విదేశీ సంస్థ టెరాసిస్ చేతుల నుంచి స్వదేశీ సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించడం ద్వారా కోటి 56 లక్షల ఎకరాల భూసమాచారం ఇప్పుడు ప్రభుత్వ భద్రతలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సులు ప్రజల సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం
భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి నేరుగా దరఖాస్తులు స్వీకరించగా, మూడు విడతల్లో మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని, వీటిపై వేగంగా పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు.
సర్వేయర్ల నియామకం, సేవల వేగవంతం
గ్రామాలు, మండలాల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లవారీగా విభజించి జీపీవోలను నియమించడమే కాక, పెద్దఎత్తున లైసెన్స్డ్ సర్వేయర్లను తయారు చేసి రంగంలోకి దింపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 4,000 మందికి శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేశామని, డిసెంబర్ నుంచి మరొక 3,000 మంది కూడా సేవలకు సిద్ధమవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ సేవల్లో సాంకేతికత
ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే పరిస్థితులకు తెరదించేందుకు రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ఆధార్ఈ సంతక విధానం ద్వారా ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతోందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
హిల్ట్ పాలసీ బీఆర్ఎస్‌పై మంత్రి విమర్శలు
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, గతంలో మున్సిపల్ శాఖ మంత్రి ముడుపులు తీసుకుని తన అనుచరుల కోసం భారీ స్థాయిలో భూములను రెసిడెన్షియల్ జోన్లుగా మార్పిడి చేశారని మంత్రి ఆరోపించారు. ఆ కాలంలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ వివరాల చిట్టాను త్వరలో బయటపెడతామని మంత్రి ప్రకటించారు.
