
స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తానని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన లక్డీకాపుల్‌లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలా తక్కువ సమయం మీడియాతో మాట్లాడినప్పటికీ అనేక అంశాల గురించి ప్రస్తావించారు. మావోయిస్టులు అంతా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించి బలమైన బృందాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. “పోలీసు స్టేషన్ల సంఖ్య కంటే, సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించడం ముఖ్యం. సాంకేతికతను వినియోగించి ఫీల్డ్ స్థాయిలో పనితీరును మెరుగుపరుస్తాం” అని ఆయన అన్నారు. పోలీస్ శాఖలో సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకొని
మావోయిస్టులపై కఠిన వైఖరి
మావోయిస్టుల సవాళ్లపై స్పందించిన డీజీపీ, ఇటీవల మావోయిస్టుల నుంచి పోరాట మార్గం వీడేందుకు సంకేతాలు వచ్చినప్పటికీ, వారి సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని అన్నారు. “జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మంచిదే. లొంగిపోయే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. అయితే ప్రజలకు హాని చేసే ప్రయత్నాలను సహించము” అని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. ఎన్నికల సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హామీ ఇచ్చారు.
డీజీపీ ముందున్న సవాళ్లు ఏమిటి?
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి పెద్దగా లేదు. అయితే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో చాలా అరుదుగా మావోయిస్టులకు కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టుుల కనిపించకుండా చేయాలని పునుకున్నది. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మరో అతి పెద్ద సమస్య సైబర్ నేరాలు. పోలీసులు, మీడియా, మేధావులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాలకు గురి అవుతూనే ఉన్నారు. ఈ సమస్యను డీజీపీ పరిష్కరించాల్సి ఉంది. దీంతోపాటు డ్రగ్స్ వాడకం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ పేరుతో ఈ టీమ్‌ను ప్రారంభించారు. ఈ సమస్యను కూడా డీజీపీ పరిష్కరించాల్సి ఉంది.
ఆశల నెరవేర్చగలరా?
కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నా, ఆయన అనుభవం, వ్యూహాలు పోలీసు శాఖను మరింత బలపరచగలవని అధికారులు భావిస్తున్నారు. ప్రజల అండ, సిబ్బంది కృషితో శాంతి భద్రతలను సమర్థంగా కాపాడగలరన్న నమ్మకం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన ప్రణాళికలను మీడియాతో పంచుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి తన బాధ్యతలను నిర్వహించేందుకు స్పష్టమైన ప్రణాళికను వెల్లడించారు.
శాంతిభద్రతల లక్ష్యంగా!
రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి శివధర్ రెడ్డి నాయకత్వంలో పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. సాంకేతికత వినియోగం, నైపుణ్య శిక్షణ, ఖాళీల భర్తీ వంటి చర్యలు ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన భావిస్తున్నారు. నక్సలిజం సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు, రాజీ ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉంది. మొత్తంగా, శివధర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసు శాఖ ఆధునికీకరణ, సమర్థ నిర్వహణ, శాంతిభద్రతల కాపాడు దిశగా గట్టి అడుగులు వేస్తోంది. ఆయన చేపట్టే చర్యలు రాష్ట్రంలో సుస్థిర శాంతిని నెలకొల్పడంలో విజయవంతమవుతాయని ఆశిస్తున్నారు.
