
స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో కీలకమైన సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నేడు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైనే చర్చించబోతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. నేడు హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ కేసుకు సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించాలి. ఎటువంటి వ్యూహాలు అవలంభించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు ముందు వినిపించాల్సిన వాదనలు, రిజర్వేషన్ విధానం అమలులో ఎదురయ్యే సవాళ్లు, బీసీ సంఘాలతో సమన్వయం కోసం వ్యూహాలు విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.
సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన
"తీర్పు అనుకూలంగా ఉంటే ఎన్నికలు సమయానికి జరుగుతాయి. వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో బలమైన వాదనలతో పోరాటం చేస్తాం" అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ కేటాయించే అంశాన్ని కూడా ఆలోచించారా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ లోతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీసీ ఓటుబ్యాంకును బలోపేతం చేసే మరో వ్యూహంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి వ్యవహారం
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. రిజర్వేషన్ల ద్వారా బీసీలను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఒక వేళ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఆ నెపాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద వేయాలని వ్యూహం రచించింది. అయితే ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అయితే రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియదని భావించలేము. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఆ నెపాన్ని ఇతర పార్టీల మీద వేస్తున్నదన్న వాదన వినిపిస్తోంది. తాము బీసీ రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నామని అయితే అందుకు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని.. కేంద్రం సహకరించడం లేదని బీసీ లోకానికి కాంగ్రెస్ పార్టీ చెప్పబోతున్నట్టు సమాచారం.
మరి బీసీలు కాంగ్రెస్ వాదనతో ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయం కోసమే ఈ ప్రయత్నం చేసిందని భావిస్తారా? లేదంటే ఆ పార్టీకి అండగా నిలబడతారా? అన్నది వేచి చూడాలి. బీసీలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూడా గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. మొత్తంగా అన్ని రాజకీయపార్టీలు బీసలను రాజకీయంగా పావులుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది.
