Let's talk: editor@tmv.in
స్థానిక ఎన్నికలకు మోగిన నగారా

స్థానిక ఎన్నికలకు మోగిన నగారా

Aravind Maryada Reddy
30 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికలకు సంబంధించి అనేక చిక్కుముడులు, వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల అంశంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎట్టకేలకు ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని శనివారం విడుదల చేశారు.

ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మిగిలిన మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 27న జరుగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు అదే రోజు నిర్వహించనున్నది.

31 జిల్లాల్లో 565 మండలాల్లో

ఈసారి మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ సాగనుంది. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలతో పాటు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ దశలోనూ ప్రత్యేకంగా నామినేషన్‌లు, పరిశీలన, ఉపసంహరణ తేదీలను ప్రకటించింది. ఈసారి క్రమశిక్షణతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. పార్టీల అభ్యర్థుల ఎంపిక, తిరుగుబాటు అభ్యర్థుల ఒత్తిడితో రాజకీయ పార్టీలకు ఈ గట్టికాలమే అసలు పరీక్ష. స్థానిక పాలనలో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అవకాశాన్ని ఓటర్లకు ఈ ఎన్నికలు కల్పిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధికి పునాది అయిన పంచాయతీ రాజ్ వ్యవస్థకు బలాన్నిచ్చేలా ఈ ఎన్నికలు ఉండనున్నాయి. వచ్చే పెద్దఎత్తున శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ బలాబలాలను మదింపు చేసుకునే వేదికగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిలవబోతున్నాయి. పల్లెల నించి వచ్చిన స్పందనే పెద్దపార్టీల విజయయాత్రకు మార్గనిర్దేశం చేయనుంది. ఈసారి ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం మరింతగా పెరగనున్నట్లు భావిస్తున్నారు. అనేక గ్రామాల్లో మహిళా అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. యువత రాజకీయ ప్రవేశానికి ఈ ఎన్నికలు ఒక మంచి వేదికగా మార

మొదటి విడత

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్‌ 9

స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్‌ 11

పరిశీలన: అక్టోబర్‌ 12

విత్ డ్రా: అక్టోబర్‌ 15

ఎన్నికల తేదీ- అక్టోబర్‌ 23

ఓట్ల లెక్కింపు- నవంబర్‌ 11

రెండో విడత

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్‌ 13

స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్‌ 15

పరిశీలన: అక్టోబర్‌ 16

నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్‌ 19

ఎన్నికల తేదీ- అక్టోబర్‌ 27

ఓట్ల లెక్కింపు- నవంబర్‌ 11

మూడో విడత

పంచాయతీ ఎన్నికలు

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్‌ 17

స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్‌ 19

పరిశీలన: అక్టోబర్‌ 20

నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్‌ 23

ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్‌ 31

నాలుగో విడత

నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్‌ 21

చివరి తేదీ: అక్టోబర్‌ 23

పరిశీలన: అక్టోబర్‌ 24

నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్‌ 27

ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్‌ 4

తుది విడత

నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్‌ 25

చివరి తేదీ: అక్టోబర్‌ 27

పరిశీలన: అక్టోబర్‌ 28

నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్‌ 31

ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్‌ 8

ఏ పార్టీ వ్యూహమేంటి?

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానమైన పోటీ నెలకొన్నది. బీజేపీకి పల్లెల్లో కొంత ప్రభావం తక్కువ. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలు ఉండటంతో బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కొరత వంటి సమస్యలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా? పార్టీల ప్రభావాలు ఏమిటి? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అసంతృప్తిని తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వడ్లకు బోనస్ రాకపోవడం వంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

యూరియా కొరత ప్రభావం

యూరియా కొరత తెలంగాణలో పెద్ద సమస్యగా మారింది. రైతులు ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని (బీజేపీ) నిందిస్తుండగా, బీజేపీ 'కృత్రిమ కొరత' అంటూ ప్రతి దాడి చేస్తోంది. బీఆర్ఎస్ కూడా ఈ సమస్యను ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తోంది. ఈ కొరత ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, అల్మట్టి డ్యామ్ సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 16న కేటీఆర్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై 13 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారంటూ దుమ్మెత్తిపోశారు. ఎన్నికలకు సిద్ధంగా లేని బీఆర్ఎస్, స్థానిక నాయకులను బలోపేతం చేసి, ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేసే వ్యూహం అవలంబిస్తోంది. అయితే కాళేశ్వరం విచారణ, ఇకార్ రేసు వంటి కేసులు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చాలా రోజులుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వస్తున్నది. మరి ఆ ప్రచారం నిజమేనా? అన్నది తేలాలంటే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా?

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ పెద్దగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేయడం లేదు. దానికి తోడు రామచందర్ రావు అధ్యక్షుడయ్యాక బీజేపీలో జోష్ కొంత మేర తగ్గింది. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితయ్యారు. క్యాడర్ లో జోష్ ఉన్నప్పటికీ వారిని ముందుకు నడిపించే నాయకుడు కరువయ్యారు. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంత మేర ప్రభావం చూపగలుగుతుందో వేచి చూడాలి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే వారి బలం నిరూపించుకోవాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకం కాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని రాజకీయపార్టీలకు ఎంతో కీలకం. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రేవంత్ రెడ్డి పాలనకు ఈ ఎన్నిక పరీక్షగా ఉండబోతున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఆ పార్టీ బలం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలబోతున్నది. బీజేపీకి కూడా ఈ ఎన్నిక ఎంతో కీలకం. మరి ఏ పార్టీ సత్తా చాటుతుందో వేచి చూడాలి.

స్థానిక ఎన్నికలకు మోగిన నగారా - Tholi Paluku