
‘స్థానిక’ప్రచారానికి దూరంగా కేసీఆర్?
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్వచించుకోవడానికి సర్వశక్తులొడ్డుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు (పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ) అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను పార్టీకి ఒక కీలకమైన 'టర్నింగ్ పాయింట్'గా మలచాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని తెలంగాణ రాజకీయాల నుంచి తమను ఎవరూ తుడిచిపెట్టలేరనే బలమైన సంకేతాన్ని ప్రజలకు, ప్రత్యర్థులకు ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి కేటీఆర్ ఒక విశ్వప్రయత్నాన్ని ప్రారంభించారు.
కేటీఆర్ 'ఆపరేషన్ రీబూట్' వ్యూహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ స్థానిక ఎన్నికల యుద్ధానికి తానే నేతృత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండనుండటంతో, కేటీఆర్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార సమన్వయం వరకూ అన్నింటినీ పర్యవేక్షించనున్నారు. పార్టీలో ఇటీవల జరిగిన కీలక పరిణామాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండకుండా జాగ్రత్తపడాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సోదరి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అంశం క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కవితకు సంబంధం లేకుండానే పార్టీ బలంగా ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
పనితీరుకు ప్రాధాన్యత
గత రెండేళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని నేతలను ఆదేశించారు. ఇది పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి, అంకితభావంతో పనిచేసేవారికి గుర్తింపునిస్తుందని భావిస్తున్నారు. పార్టీ పరపతి పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఏ మాత్రం తగ్గలేదని నిరూపించడానికి కేటీఆర్ జిల్లాల వారీగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు సీనియర్ నేత హరీశ్ రావు కూడా మరికొన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 'బాకీ అస్త్రం'
ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేటీఆర్ నేతలకు సూచించారు.
'బాకీ కార్డు' ప్రయోగం
కాంగ్రెస్ ప్రజలకు చెల్లించాల్సిన 'బాకీ'ని తెలియజేస్తూ కేటీఆర్ ఇప్పటికే ఒక "బాకీ కార్డు"ను విడుదల చేశారు. ఈ కార్డును ప్రతి ఇంటికీ చేరేలా చూసి ప్రజలను మోసం చేసిన తీరును వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచి అధికార ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చాటి చెప్పాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
జూబ్లీహిల్స్ లో ప్రతిష్టాత్మక పోరు
స్థానిక ఎన్నికలతో పాటు, బీఆర్ఎస్ ప్రస్తుత దృష్టిలో అత్యంత ముఖ్యమైనది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం వల్ల ఈ స్థానాన్ని గెలుచుకోవడం పార్టీకి అత్యంత కీలకం. గత ఎన్నికల్లో గెలిచిన ఈ స్థానాన్ని కోల్పోతే అది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా హైదరాబాద్ నగరంలో తమ పట్టు చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఉప ఎన్నికలో గెలుపు అనేది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము పట్టు కోల్పోయినా ప్రజల ఆదరణ ఇంకా ఉందనే బలమైన రాజకీయ సందేశాన్ని ఇస్తుంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు.
నిరూపించాల్సిన తరుణం
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కేటీఆర్ స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కవిత వ్యవహారం వంటి అంతర్గత పరిణామాలు పార్టీ బలాన్ని ప్రభావితం చేయలేవని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, బలాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని నిరూపించాల్సిన తరుణం ఆసన్న మైందని, రాబోయే రోజుల్లో కేటీఆర్ పర్యటనలు, హరీష్ రావు ప్రచారాలు 'బాకీ కార్డు' ప్రచారంతో బీఆర్ఎస్ ఒక పెద్ద రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ తన పాత ప్రభను తిరిగి నిరూపించుకుంటుందా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది.
