
‘స్థానికం’.. ఆగెను!
న్యాయనిపుణులు ఊహించిందే జరిగింది. స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. వీటితో పాటు బీసీ రిజర్వేషన్లపై కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఒక్కసారిగా బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరి ప్రభుత్వం ఏం చేయబోతున్నది? సుప్రీంకోర్టుకు వెళ్తుందా? లేదంటే పార్టీలపరంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని ప్రతిపాదిస్తుందా? అన్నది వేచి చూడాలి. హైకోర్టు ఇచ్చిన స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనున్నది. అదే సమయంలో ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, పిటిషనర్లు రెండు వారాల్లో స్పందించాలని కోర్టు ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వ వాదన ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడానికి ఆధారంగా కుల గణన సర్వేను చూపింది. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6 శాతం ఉందని, స్వాతంత్ర్యం తర్వాత మొదటి సమగ్ర కుల గణన ఇక్కడే జరిగిందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి, బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించినట్లు కోర్టుకు వివరించారు. మరోవైపు, పిటిషనర్లు ఈ రిజర్వేషన్ 50 శాతం సీలింగ్‌ను మించిపోతుందని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
ప్రభుత్వం తరఫున న్యాయవాది రవివర్మ రాజ్యాంగంలో 50 శాతం సీలింగ్ ఎక్కడా లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభాకు 67 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నామని కౌంటర్ చేశారు. రెండు రోజుల సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, జీవో అమలును నిలిపివేసింది. ఇది తాత్కాలికమే అయినా, తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయం రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావం చూపనుంది. మరోవైపు, సుప్రీం కోర్టులో కూడా ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ డేవ్‌లతో చర్చలు జరుపుతోంది.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు
కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించడం సామాజిక న్యాయానికి చిహ్నంగా చూపించుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్లి సుప్రీం కోర్టు అడ్వకేట్లతో సంప్రదింపులు జరిపారు. అయితే, ఈ స్టేతో ఎన్నికలు వాయిదా పడటం ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు దశల్లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు ఆరు వారాలు ఆగనున్నాయి. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వం కేవలం బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని బీఆర్ఎస్ వాదిస్తోంది.
బీసీ సంఘాల ఆందోళనలు, ప్రతిచర్యలు
బీసీ సంఘాలు ఈ స్టేను తీవ్రంగా వ్యతిరేకించాయి. హైదరాబాద్‌లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి వంటి సంస్థలు 42 శాతం రిజర్వేషన్‌ను స్వాగతించినా, దాని అమలుకు చట్టపరమైన బలం లేదని ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎల్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు, ఇది సామాజిక అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. ఈ రిజర్వేషన్ బీసీల రాజకీయ సాధికారతకు మార్గం పరచాలని భావిస్తున్నారు. కానీ స్టేతో వారి ఆశలు దెబ్బతిన్నాయి.
