
స్త్రీ సాధికారతకు పది సూత్రాల ప్రణాళిక:మంత్రి సత్య కుమార్ యాదవ్
రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసం ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వినూత్నంగా 'పది సూత్రాల ప్రణాళికను ప్రకటించింది. సామాజిక ఆర్థిక కారణాల వల్ల వెనుకబాటుకు గురవుతున్న మహిళలను రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. నూతన జనాభా స్థిరీకరణ విధానంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.
శిశు సంరక్షణ కేవలం తల్లుల బాధ్యతే కాదనే స్పృహను సమాజంలో కల్పించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 180 రోజుల మెటర్నటీ లీవ్ (ప్రసూతి సెలవు) స్థానంలో తల్లిదండ్రులిద్దరూ కలిపి వాడుకునేలా '12 నెలల పేరెంట్ హుడ్ లీవ్' సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా మహిళలు నిశ్చింతగా పని చేసేలా 50 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి చోటా శిశు సంరక్షణ కేంద్రాలను (క్రెష్‌లు) ఏర్పాటు చేయాలని ప్రతి లక్ష మంది జనాభాకు ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
సంతానలేమితో బాధపడుతున్న సుమారు 12 లక్షల కుటుంబాలకు ఊరటనిస్తూ ప్రభుత్వమే ఉచితంగా సంతాన సాఫల్య సేవలను అందించనుందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా 'మాతృత్వ' పథకం కింద 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటా సుమారు 50 వేల మందికి ఈ సేవలు అందజేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందిస్తామని వివరించారు.
ఇక మహిళల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం కఠిన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 68 శాతం నుంచి ఐదేళ్లలో 40 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా చిన్న వయస్సు గర్భధారణలను 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గించి, తల్లీబిడ్డల మరణాలను అరికట్టేందుకు పటిష్టమైన కౌన్సిలింగ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెంపు
రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని 31 శాతం నుండి 61 శాతానికి పెంచడం ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని 15 శాతం మేర పెంచవచ్చని మంత్రి విశ్లేషించారు. మహిళలకు అనుకూలమైన పనివేళలు, ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వీటితో పాటు 'కేర్ ఎకానమీ' ద్వారా శిశువులు, వృద్ధుల సంరక్షణ కోసం ప్రతి ఏటా 5,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని, ఈ క్రతువులో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేస్తామని సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
