Let's talk: editor@tmv.in
స్టాలిన్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం ఉంది: మమతా

స్టాలిన్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం ఉంది: మమతా

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, కాంగ్రెస్‌తో బీజేపీకి రహస్య ఒప్పందం ఉందని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి పనులు ప్రభావితమవుతున్నాయని ఆమె అన్నారు. ఎన్నికల సంఘం పలువురు అధికారులను తమిళనాడుకు ఎన్నికల పరిశీలకులుగా పంపిందని, దీంతో రాష్ట్రంలో పరిపాలన దెబ్బతింటోందని పేర్కొన్నారు.

నాదియా జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన మమతా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ నుంచే సుమారు 500 మంది అధికారులను బదిలీ చేశారని, ఇతర రాష్ట్రాల నుంచి మాత్రం చాలా తక్కువ మందిని మాత్రమే పంపారని విమర్శించారు. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే నేతృత్వంలోని కూటమి ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే మధ్య జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఐక్యత కోసం పర్యటిస్తానని మమతా ప్రకటించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుంటానని తెలిపారు.

వారివి మాత్రం ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు

అదేవిధంగా 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉపయోగించిన ఓటరు జాబితాను మూడు నెలల ముందే రద్దు చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లో చేపలు, మాంసం, గుడ్లు తినడంపై కూడా పరిమితులు విధించే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు. మమతా మరోసారి పౌరసత్వ అంశాన్ని ప్రస్తావిస్తూ, కొద్దికాలంగా భారత్‌లో ఉన్నవారికి పౌరసత్వం ఇస్తూ, చాలాకాలంగా ఇక్కడ నివసిస్తున్న వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు.

బెంగాల్‌లో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ప్రజలను ఎన్‌ఆర్‌సీ పేరుతో బయటకు పంపే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. అలాగే ఎన్నికలు ‘ధర్మయుద్ధం’ లాంటివని పేర్కొంటూ, తన ధర్మం ఐక్యత, మానవత్వమని, బీజేపీ మాత్రం ప్రజలను మతాల పేరుతో విభజిస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ఏప్రిల్ 8న భబానీపూర్‌‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.