Let's talk: editor@tmv.in
స్టాలిన్‌కు అధికారం ఉంటే తిరునల్వేలి సభ జరిగేది కాదు: విజయ్

స్టాలిన్‌కు అధికారం ఉంటే తిరునల్వేలి సభ జరిగేది కాదు: విజయ్

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత, నటుడు విజయ్‌ బుధవారం తిరునల్వేలిలో జరిగిన సభలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌కు పూర్తి అధికారాలు ఉంటే తన ప్రచార సభనే అడ్డుకునేవారని ఆయన ఆరోపించారు. ఏప్రిల్‌ 23న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన విజయ్‌, ప్రస్తుతం రాష్ట్రంలో ‘కేర్‌టేకర్ ప్రభుత్వం’కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. స్టాలిన్‌కు పూర్తి అధికారాలు ఉంటే మమ్మల్ని ఇక్కడికి రానివ్వరు. కానీ ఇప్పుడు ఆయన అధికారాలు లేని ముఖ్యమంత్రి లాంటివారని అన్నారు.

ఇక అధికార పార్టీ డీఎంకేపై విమర్శలు చేస్తూ, తమిళనాడు కాంగ్రెస్‌ను కోట్ల రూపాయలు ఇచ్చి తమవైపు తిప్పుకున్నారని విజయ్ ఆరోపించారు. అయితే ‘నిజమైన కాంగ్రెస్ మాత్రం టీవీకేకు మద్దతుగా ఉంది’ అని ఆయన అన్నారు.

డీఎంకే నేతృత్వంలోని కూటమిని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో ఏర్పడిన ‘డబ్బుల పెట్టె కూటమి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమి అంతర్గతంగా చీలిపోయింది. పైభాగం ఒకలా, దిగువ భాగం మరోలా ఉంది. కూటమి భాగస్వాములు ఒకరికొకరు ఓటు వేయకపోవచ్చని కూడా అనిపిస్తోందని విమర్శలు గుప్పించారు.

తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి

అదే సమయంలో డీఎంకే, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని విజయ్ ఆరోపించారు. బయటకు వేర్వేరు కూటముల్లా కనిపించినా, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడమే రెండింటి లక్ష్యమని చెప్పారు. రాజకీయాల్లోకి తాను ప్రవేశించిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందనను ప్రస్తావిస్తూ, ఈ ఎన్నిక తనకు కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాక భావోద్వేగంతో కూడిన పోరాటమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ పాలనపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ బలహీనపడిందని, నేరాలు పెరిగాయని, యువతకు ఉద్యోగాలు లేవని, మహిళల భద్రత దెబ్బతిందని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కూడా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్ నేతృత్వంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కొనసాగించాలా, లేక ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలా అన్నది నిర్ణయించుకోవాలని ఆయన ఓటర్లను కోరారు.