Let's talk: editor@tmv.in
స్టార్మర్‌ పీఠానికి ‘ఎప్‌స్టీన్‌’ సెగ.. బ్రిటన్‌ తర్వాతి ప్రధాని ఎవరు?

స్టార్మర్‌ పీఠానికి ‘ఎప్‌స్టీన్‌’ సెగ.. బ్రిటన్‌ తర్వాతి ప్రధాని ఎవరు?

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. అమెరికా రాయబారిగా పీటర్ మాండెల్సన్‌ను నియమించిన నిర్ణయం ఆయన మెడకు చుట్టుకుంది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో మాండెల్సన్‌కు ఉన్న పాత సంబంధాల తాలూకు పత్రాలు ఇప్పుడు బయటపడటమే దీనికి ప్రధాన కారణం. గతంలో ఎప్‌స్టీన్‌ శిక్ష అనుభవించిన తర్వాత, అతడి అతిథుల కోసం మాండెల్సన్ ఒక ప్రైవేట్ విల్లాను ఏర్పాటు చేసినట్లు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. ఇది రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

క్షమాపణలు చెప్పినా తగ్గని రచ్చ

నిజానికి, మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌‌తో సంబంధాలు ఉన్నాయని తెలిశాక గతేడాది సెప్టెంబర్‌లోనే స్టార్మర్ అతడిని పదవి నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పారు. కానీ, ఆయన నిర్ణయ సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోంది. తాజా సర్వేల ప్రకారం స్టార్మర్ ప్రజాదరణ రేటింగ్ 20 శాతానికి పడిపోయింది. పార్టీలోని కొందరు మంత్రులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నా, ప్రతిపక్షాలు, బాధితులు ప్రధాని తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయినప్పటికీ, తాను వెనక్కి తగ్గకుండా పోరాడుతానని స్టార్మర్ స్పష్టం చేస్తున్నారు.

మొండితనమే ముంచుతోందా?

సాధారణంగా ఇలాంటి వివాదం తలెత్తినప్పుడు సదరు నియామకాన్ని వెంటనే రద్దు చేస్తే సమస్య సర్దుమణిగే అవకాశం ఉంటుంది. కానీ, స్టార్మర్ మాత్రం మాండెల్సన్‌వైపే మొగ్గు చూపడం విమర్శలకు తావిస్తోంది. మాండెల్సన్ ప్రధానికి అత్యంత నమ్మకమైన వ్యూహకర్త కావడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. "తప్పుడు వ్యక్తిని ఎంపిక చేయడమే కాకుండా, తప్పు తెలిసినా వెనక్కి తగ్గకపోవడం" ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తోంది. ఇది కేవలం ఒక నియామక వివాదంగా కాకుండా, ప్రధాని నైతికతపై యుద్ధంగా మారింది.

ప్రధాని రేసులో ఉన్నది వీరే..

ఒకవేళ స్టార్మర్ గద్దె దిగితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు లేబర్ పార్టీలో అప్పుడే పోటీ మొదలైంది. ప్రధానంగా ఐదుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో..

వెస్ స్ట్రీటింగ్:

ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఆయన మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. స్టార్మర్‌పై తిరుగుబాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించినప్పటికీ, పార్టీలో ఆయనకు మద్దతు పెరుగుతోంది. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన స్ట్రీటింగ్, గాజా యుద్ధం వంటి అంతర్జాతీయ అంశాలపై స్పష్టమైన గొంతుకను వినిపిస్తున్నారు.

ఏంజెలా రేనర్:

మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 16 ఏళ్లకే చదువు ఆపేసి, పేదరికం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు ట్రేడ్ యూనియన్ల మద్దతు పుష్కలంగా ఉంది. పాత ఇంటి పన్ను వివాదంతో గతేడాది ఆమె రాజీనామా చేసినా, తాజా ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వివాదంలో ఆమె ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

ఆండీ బర్న్ హామ్:

గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్ హామ్ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే, బ్రిటన్ నిబంధనల ప్రకారం ప్రధాని కావాలంటే ఎంపీ అయి ఉండాలి. ఫిబ్రవరిలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం లేబర్ పార్టీ నిరాకరించడం ఆయనకు కొంత ప్రతికూలంగా మారింది.

షబానా మహమూద్:

ప్రస్తుత హోం శాఖ మంత్రి షబానా మహమూద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వలసల నియంత్రణ, శాంతిభద్రతల విషయంలో ఆమె తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీలోని కుడి పక్షం నేతలను ఆకట్టుకుంటున్నాయి. అత్యంత క్లిష్టమైన శాఖను నిర్వహిస్తూ ఆమె తన పాలనా దక్షతను నిరూపించుకుంటున్నారు.

ఎడ్ మిలిబాండ్:

గతంలో లేబర్ పార్టీ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఎడ్ మిలిబాండ్‌కు ఉంది. 2015 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఇంధన శాఖ మంత్రిగా ఉన్న ఆయన, మళ్లీ ప్రధాని పదవిపై ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, అనుభవం రీత్యా ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది.

80 మంది ఎంపీల మద్దతు ఉంటేనే..

బ్రిటన్ పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ప్రధానిని తొలగించడం అంత సులభం కాదు. కనీసం 80 మంది లేబర్ పార్టీ ఎంపీలు స్టార్మర్‌కు వ్యతిరేకంగా సంతకాలు చేస్తేనే నాయకత్వ మార్పు సాధ్యమవుతుంది. "సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా స్టార్మర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?" అన్న ప్రశ్న సొంత పార్టీ ఎంపీలనే అసహనానికి గురిచేస్తోంది. ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వివాదం సద్దుమణగకపోతే బ్రిటన్ త్వరలోనే కొత్త ప్రధానిని చూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.