
స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను పారదర్శకంగా, అవినీతిరహితంగా, ప్రజలకు మరింత చేరువగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అనుగుణంగా శాఖను సంపూర్ణంగా ఆధునీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖలో రాబోతున్న ఆధునిక మార్పులను వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో కూడిన ఆధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, ఆ తర్వాత జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ బిల్డర్లు ఈ కార్యాలయాలను నిర్మించి, ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడతారని పేర్కొన్నారు.
స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖను కేవలం ఆదాయ వసూలు కేంద్రంగా కాకుండా ప్రజాసేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ముఖ్యంగా పేదల భూములు, ప్రభుత్వ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ ఆక్రమణలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. అదే సమయంలో, కేటాయించిన భూములు ఏదైనా ప్రజాప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవాల్సి వస్తే, లబ్ధిదారులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
స్టాంపులు & రిజిస్ట్రేషన్లకు చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు, కొత్తగా పెళ్లయి రిజిస్ట్రేషన్ చేసుకునే జంటలు, వయోవృద్ధులు, సామాన్య ప్రజలకు సకల సౌకర్యాలు అందించడానికి రూపొందించబడ్డాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి, ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా సౌకర్యవంతమైన, పారదర్శక, అవినీతి రహిత సేవలను అందించడానికి ఈ కొత్త కార్యాలయాలు రూపకల్పన చేయబడ్డాయని మంత్రి తెలిపారు.
ఈ సంస్కరణలతో స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని, సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
