
స్టాండ్ విత్ హర్ కాదు.. ‘గివ్ హర్ స్పేస్’: కవిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మహిళల సాధికారత కోసం సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే జరుపుకోవాల్సింది కాదని, ప్రతి రోజు మహిళలకు సమాన గౌరవం దక్కే పరిస్థితులు రావాలని ఆమె అన్నారు. ఇళ్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి వ్యవస్థలు మహిళల పాత్రతోనే నడుస్తాయని చెప్పారు. సమాజాభివృద్ధికి మహిళలే ప్రధాన శక్తి అని, సామాజిక, పురుషాధిపత్య వివక్షలను ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దని కవిత సూచించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమాన్ని కవిత తీవ్రంగా ఖండించారు.మహిళలతో మగవారు నిలబడితేనే భద్రత ఉంటుందనడం మహిళలను అవమానించడమే. మాకు కావాల్సింది రక్షణ బిక్ష కాదు, మాకంటూ ఒక గుర్తింపు, స్పేస్ కావాలి అని ఆమె స్పష్టం చేశారు. గివ్ హర్ స్పేస్ అనేది మా జాగృతి నినాదమని ఆమె తెలిపారు.రాజకీయాల్లో మహిళలకు అవకాశం ఇచ్చి, వెనుక ఉండి మగవారే నడిపించే సంస్కృతి మారాలని పిలుపునిచ్చారు.
మహిళలకు పూర్తి స్వేచ్ఛ, సమానత్వం ఇంకా అందలేదని పేర్కొన్న ఆమె, బిడ్డకు పేరు పెట్టే హక్కు సహా అనేక అంశాల్లో పరిమితులు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని, అన్ని కులాల మహిళలు నాయకత్వ రంగంలోకి రావాలని కోరారు. ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు దిశగా తీసుకున్న ప్రయత్నాల్లో జాగృతి కీలక పాత్ర పోషించిందని చెప్పారు. భవిష్యత్తులో 50 శాతం ప్రాతినిధ్యం సాధించాల్సిన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా మహిళా బిల్లు అమలులోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.
ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకోవాలని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు నిరంతర విద్య అవసరమన్నారు. మహిళలు తమ ఆర్థిక అవసరాలను స్వయంగా తీర్చుకునేలా ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మహిళల రక్షణపై మరింత బాధ్యత వహించాలని, హామీల అమలులో నిర్లక్ష్యం చేయరాదని ఆమె సూచించారు. రాజకీయాల్లోకి వయోపరిమితి లేకుండా మహిళలు రావాలని, సామాజిక సేవలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు.
