Let's talk: editor@tmv.in
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచండి : సీఎం

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచండి : సీఎం

Panthagani Anusha
4 డిసెంబర్, 2025

రాష్ట్రంలో 'స్క్రబ్ టైఫస్' కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై యుద్ధప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి చండక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్తో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను సౌరభ్ గౌర్ వివరిస్తూ, ఆమెను 'చిగ్గర్ మైట్' (సూక్ష్మ లార్వా పురుగు) అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించిందని, ముందుగా టైఫాయిడ్‌ అనుకోని చికిత్స అందించగా, రాపిడ్ టెస్ట్‌లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.

ఇది అంటువ్యాధి కాదు.. పురుగు కాటుతోనే సంక్రమణ

'ఒరియెంటియా సుట్సుగాముషి' అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని అయితే ఇది అంటువ్యాధి కాదని అధికారులు సీఎంకు వివరించారు. ఈ వ్యాధి లక్షణాలలో అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులుతో పాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడడం ముఖ్య లక్షణమని తెలిపారు. సకాలంలో యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స అందిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ వ్యాధి శ్వాసకోశ వైఫల్యం కాలేయ వాపు, తీవ్ర మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.

కాగా ఈ ఏడాదిలో చిత్తూరు, కాకినాడ జిల్లాల్లోనూ కేసులు నమోదైన విషయాన్ని అధికారులు ప్రస్తావించగా, చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాతపడే స్థాయికి పరిస్థితి రాకూడదని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిగ్గర్ మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి, దాని ప్రమాదంపై ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని, ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించేలా, వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ వ్యాధి పొలాలు, దట్టమైన పొదలు లేదా గడ్డి ప్రాంతాల్లో నివసించే లేదా పనిచేసే వారిలో వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.