Let's talk: editor@tmv.in
స్క్రబ్‌ టైఫస్ లక్షణాలతో తొమ్మిది మంది మృతి: ఏపీ

స్క్రబ్‌ టైఫస్ లక్షణాలతో తొమ్మిది మంది మృతి: ఏపీ

Panthagani Anusha
10 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు, ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన తొమ్మిది మంది మృతిచెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ సోమవారం తెలిపారు. అయితే, ఈ మరణాలకు కారణం స్క్రబ్‌ టైఫసేనా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదని దీనిపై లోతైన పరిశోధన జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

వీరపాండియన్‌ మీడియాతో మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్పై ఆందోళన అవసరం లేదని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే ఎవరు మరణించరని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఈ ఏడాది కొత్తగా వచ్చినట్లుగా భావించవద్దని ప్రజలకు సూచించారు. గతేడాది 1,613 స్క్రబ్ టైఫస్ కేసులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,566 స్క్రబ్ ట్రైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా ఎప్పుడు మరణించిన తొమిది మంది కూడా ఈ వ్యాధి లక్షణాలు మరణించారు,అయినప్పటికీ వారి మరణాలకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ (జన్యు శ్రేణి) పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పి హెచ్ సిలు) స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత లోతైన పరీక్షల కోసం గుంటూరు, తిరుపతిలోని కేంద్రాలకు నమూనాలను పంపుతున్నట్లు కమిషనర్‌ వివరించారు. రాష్ట్రంలో పరీక్షల విస్తృతి పెరగడం వల్ల కేసుల గుర్తింపు సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని వీరపాండియన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308 కేసులు నమోదు కాగా ఏపీలో 1,566 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అధిక కేసులు నమోదైన లేదా అసాధారణ మరణాలు సంభవించిన ప్రాంతాల్లో ఎపిడెమియోలాజికల్‌ పరిశోధనల కోసం 26 జిల్లాల్లోనూ రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను మోహరించారు. ఈ బృందాలు నివాస పరిసరాలను సమీక్షించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాయి అని తెలిపారు.

ఇదిలా ఉండగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో బాధపడుతున్న బత్తుల లూర్దమ్మ (64) చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామంలోనూ ఒక వ్యక్తికి స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి చండక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడం గమనార్హం.

అంటువ్యాధి కాదు.. పురుగు కాటుతోనే సంక్రమణ

ఒరియెంటియా సుట్సుగాముషి' అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని అయితే ఇది అంటువ్యాధి కాదు ఈ వ్యాధి లక్షణాలలో అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులుతో పాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడడం ముఖ్య లక్షణాలు. సకాలంలో యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స అందిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ వ్యాధి శ్వాసకోశ వైఫల్యం కాలేయ వాపు, తీవ్ర మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.

కాగా చిత్తూరు, కాకినాడ జిల్లాల్లోనూ ఈ కేసులు నమోదైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చిగ్గర్ మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి, ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించేలా వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని వీరపాండియన్ వెల్లడించారు. అయితే ఈ వ్యాధి పొలాలు, దట్టమైన పొదలు లేదా గడ్డి ప్రాంతాల్లో నివసించే, పనిచేసే వారిలో వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

స్క్రబ్‌ టైఫస్ లక్షణాలతో తొమ్మిది మంది మృతి: ఏపీ - Tholi Paluku