
స్కూల్ ఫీజులపై స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలి: కవిత డిమాండ్
తెలంగాణలో ఆకాశాన్ని తాకుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం సోషల్ మీడియా వేదికగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటైన ప్రశ్నలు సంధించారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను పిలిచినప్పుడు, మధ్యతరగతి కుటుంబాలను లూటీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల కోసం సాధ్యమైనప్పుడు, సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్న ఫీజుల నియంత్రణ చట్టం కోసం ఎందుకు సాధ్యం కాదు? అని ఆమె నిలదీశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి సమర్పించి నెలలు గడుస్తున్నా, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు. ప్రభుత్వ దగ్గర ఉన్న ఆ బిల్లు దుమ్ము పడుతోంది, కానీ పాఠశాలల్లో ఫీజులు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, ప్రజలకు చేస్తున్న ద్రోహం అని కవిత విమర్శించారు.
ప్రభుత్వానికి, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు మధ్య ఏదైనా అదృశ్య ఒప్పందం ఉందా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం మౌనంగా ఉందా అని ప్రశ్నించారు. భారీగా పెరుగుతున్న ఫీజుల వల్ల సామాన్య కుటుంబాల జీవితకాల పొదుపు అంతా కరిగిపోతోందని, కనీసం జీవించడం కూడా భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సాకులు చెప్పడం మానేసి, వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలిచి ఫీజు నియంత్రణ చట్టాన్ని ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించిన నేపథ్యంలో కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పెరుగుతున్న స్కూల్ ఫీజుల అంశంపై మధ్యతరగతి తల్లిదండ్రుల నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ తరగతులు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 1,08,000 ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఏవీఎన్ లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నెలకు రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు ఫీజులు ఉంటున్నాయని, దానికి మించి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు కనీసం మూడో తరగతి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నారని సీఎం గుర్తు చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ధృవీకరించారు. దీనివల్ల సామాన్య ప్రజలకు నాణ్యమైన ముందస్తు ప్రాథమిక విద్య అందుబాటులోకి రానుంది.
