Let's talk: editor@tmv.in
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 'ఈడీ' క్లీన్ చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 'ఈడీ' క్లీన్ చిట్

Panthagani Anusha
2 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ)సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసు రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని ఏళ్లుగా తీవ్ర దుమారం రేపిన అంశంగా కొనసాగుతోంది. అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడి పాత్రపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు, ఆయన అరెస్టు అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) దర్యాప్తు… ఇలా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. తాజాగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది.

నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రాజెక్టు

2014–2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ ఎస్ డీసీ) ను ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి సాంకేతిక శిక్షణ అందించేందుకు జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో పాటు డిజైన్‌టెక్ సిస్టమ్స్ వంటి ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి ఇంజనీరింగ్, ఆటోమేషన్, ఇండస్ట్రియల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.

అధికార మార్పుతో వివాదం

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించలేదని, నకిలీ బిల్లులు, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. మొదట రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్ల నష్టం జరిగిందని పేర్కొనగా దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ మొత్తం రూ.1,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఆరోపణలను పెంచింది.

అయితే ఈ ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో భాగంగా 2023 సెప్టెంబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. చంద్రబాబు అరెస్టును టీడీపీ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించగా వైసీపీ మాత్రం ‘ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి బాధ్యులెవరైనా సరే శిక్ష తప్పదు అని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు 50 రోజులకుపైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం 2023 అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ ప్రభుత్వ నిధులు అక్రమంగా ఇతర కథలకు మళ్ళించారంటూ పలువురు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో అనేక మంది నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.54 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.

తాజా ఛార్జిషీట్‌లో కీలక అంశాలు

ఇటీవల ఈడీ దాఖలు చేసిన తాజా (సప్లిమెంటరీ) ఛార్జిషీట్‌లో ప్రభుత్వ నిధులు మళ్లిచారని పేర్కొన్నప్పటికీ ఆదాయాన్ని అక్రమంగా మార్చడంలో (మనీ లాండరింగ్‌లో) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ కారణంగా తాజా ఛార్జిషీట్‌లో ఆయనను నిందితుడిగా చేర్చలేదు.

కాగా ఈడీ ఛార్జిషీట్‌లో డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ ఖాన్వెల్కర్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సుమన్ బోస్), ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ తదితర ప్రైవేట్ వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు రాహుల్ నవీన్ నేతృత్వంలోనే ఈ కేసులో తాజా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. మొత్తంగా –సీమెన్స్ కేసు ఒకప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపిన వ్యవహారంగా నిలిచింది.