Let's talk: editor@tmv.in
సౌరశక్తి సమ్మిళిత అభివృద్ధికి దారి చూపే శక్తి: రాష్ట్రపతి

సౌరశక్తి సమ్మిళిత అభివృద్ధికి దారి చూపే శక్తి: రాష్ట్రపతి

Pinjari Chand
29 అక్టోబర్, 2025

సౌరశక్తి అంటే కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, అది సాధికారత, సమ్మిళిత అభివృద్ధికి ఉపయోగపడే మార్గమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సౌర అలయన్స్( ఐఎస్ఏ) అసెంబ్లీ ఎనిమిదవ సదస్సు ప్రారంభ సమావేశాన్ని రాష్ట్రపతి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌరశక్తిని సమ్మిళితం, సామూహిక శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలనే మానవాళి ఉమ్మడి ఆకాంక్షకు ఐఎస్ఎ చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.

వాతావరణ మార్పు మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఈ ముప్పును పరిష్కరించడానికి అత్యవసరమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉంది. అలాగే ఆ దిశగా దృఢమైన చర్యలు తీసుకుంటోంది. సౌరశక్తిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఐఎస్ఎ ఒక కీలకమైన ముందడుగు వేస్తుందన్నారు. ఐఎస్ఎను స్థాపించడం వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో ముఖ్యమైన అడుగని, ఇది సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె వివరించారు.

భారత అభివృద్ధి ప్రయాణం సమగ్రత అనే ఆలోచనపై ఆధారపడి ఉందని రాష్ట్రపతి చెప్పారు. దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ వెలుగులు నింపిన అనుభవం, సామాజిక సమానత్వానికి శక్తి సమానత్వమే పునాది అని నిరూపించిందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉండటం సమాజాలకు శక్తినిస్తుంది. సమాజాల సాధికారత కలిగిస్తుంది, స్థానిక ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాకు మించి విస్తరించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అన్ని సభ్యదేశాలు కేవలం మౌలిక వసతులకే పరిమితం కాకుండా ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలన్నారు. ఈ అసెంబ్లీ సౌరశక్తిని ఉద్యోగ సృష్టి, మహిళా నాయకత్వం, గ్రామీణ జీవనోపాధులు, డిజిటల్ చేర్పు వంటి అంశాలతో అనుసంధానించే సమష్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

మార్పుతో ప్రగతిని కొలవాలి

మన ప్రగతిని మెగావాట్లతో కాకుండా వెలుగులు నింపిన జీవితాల సంఖ్యతో, బలపరిచిన కుటుంబాల సంఖ్యతో, మార్పు వచ్చిన సమాజాల సంఖ్యతో కొలవాలని రాష్ట్రపతి సూచించారు. అధునాతన సాంకేతికత అభివృద్ధి, అన్ని దేశాల మధ్య దానిని పంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో సౌర ప్రాజెక్టులు విస్తరించినప్పటికీ, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకూడదని హెచ్చరించారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణే గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గు చూపడానికి కారణమని ఆమె నొక్కి చెప్పారు. మన కృషి కేవలం మన దేశాలకే కాదు ప్రపంచమంతటికీ, కేవలం ఈ తరం కోసం కాదు రాబోయే తరాల కోసం కూడా ఉండాలని ఆకాంక్షించారు. ఆమె ఈ అసెంబ్లీ చర్చలు, నిర్ణయాలు సౌరశక్తి ఉత్పత్తిలో ఒక మైలురాయిగా నిలుస్తాయని, సమానమైన, సమగ్ర ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ సౌర అలయన్స్ (ఐఎస్ఎ) అసెంబ్లీ తొలిసారి 2018 అక్టోబర్ 2 నుంచి 5 వరకు గ్రేటర్ నోయిడా (భారతదేశం) లో జరిగింది. ఐఎస్ఎ అనేది 2015లో పారిస్‌లో జరిగిన COP21 వాతావరణ సదస్సు సందర్భంగా భారతదేశం, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి. ఇది అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఈ అసెంబ్లీ ప్రతి సంవత్సరం సమావేశమవుతుంది. ఈసారి 2025లో జరుగుతున్న అసెంబ్లీలో సుమారు 124 దేశాలు (సభ్య దేశాలు) పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన అనేక దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.

అంతర్జాతీయ సౌర అలయన్స్ ఏర్పాటు వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం సౌరశక్తి వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల (భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సౌరశక్తిని అందుబాటులోకి తేవడం.

ఐఎస్ఎ ప్రధాన లక్ష్యాలు

విద్యుత్ కొరత ఉన్న దేశాలకు సూర్యశక్తి ద్వారా చవకైన, శాశ్వతమైన విద్యుత్ అందించడం.

బొగ్గు, ఇంధనాల వంటి కాలుష్యకారక శక్తి వనరులపై ఆధార పడటాన్ని తగ్గించడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడం.

అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సౌర ప్యానెల్ టెక్నాలజీ, నిల్వ వ్యవస్థలు, నిర్వహణ పద్ధతులు మొదలైనవాటిని పంచుకోవడం. సౌర ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీ రుణాలు, నిధులు, ప్రైవేట్ పెట్టుబడులు సమకూర్చడం. సౌరశక్తి ద్వారా ఉద్యోగ సృష్టి, మహిళల సాధికారత, గ్రామీణ విద్యుతీకరణ, డిజిటల్ చేర్పు వంటి సామాజిక మార్పులకు దోహదం చేయడం.

ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే శక్తి అనే భావనతో ఐఎస్ఎ స్థాపించబడింది. దీని ఉద్దేశం ప్రపంచాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించడం. పర్యావరణ పరిరక్షణతో పాటు సమాన అభివృద్ధి సాధించడం.

సౌరశక్తి సమ్మిళిత అభివృద్ధికి దారి చూపే శక్తి: రాష్ట్రపతి - Tholi Paluku