
సౌదీ, యూఏఈ మధ్య ముదిరిన ఘర్షణ
యెమెన్‌లోని వేర్పాటువాద ఉద్యమం ముగిసింది. ఈ క్రమంలో శుక్రవారం సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దక్షిణ యెమెన్ కోసం ఒక స్వతంత్ర దేశ రాజ్యాంగాన్ని ప్రకటించింది. ఈ పరిణామం గల్ఫ్ శక్తులైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఘర్షణను మరింత తీవ్రం చేసింది.
యూఏఈ మద్దతు ఉన్న సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్, దక్షిణ యెమెన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ 30 అధికరణల రాజ్యాంగాన్ని విడుదల చేసింది. దీనిని "స్టేట్ ఆఫ్ సౌత్ అరేబియా"గా పేర్కొన్నారు.
సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అధినేత ఐదారస్ అల్-జుబైదీ మాట్లాడుతూ, ఈ రాజ్యాంగం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల ఓటింగ్ ద్వారా తుది నిర్ణయం ఉంటుందని ఇతర పక్షాలు దీనిని అంగీకరించకపోతే లేదా సైనిక చర్యకు దిగితే తాము కూడా గట్టిగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
కాగా, యెమెన్‌లో ఉగ్రవాద వ్యతిరేక మిషన్లు ముగియడంతో తమ దళాల ఉపసంహరణ పూర్తయిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది. యెమెన్‌లో అల్లర్లు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సౌదీ అరేబియా ప్రతిస్పందన
తమ కళ్లముందే దేశం ముక్కలవుతుండటంతో సౌదీ అరేబియా కఠినంగా వ్యవహరిస్తోంది. సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ స్వాధీనం చేసుకున్న హధ్రమౌత్, మహ్రా ప్రాంతాల్లోని శిబిరాలపై సౌదీ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. కౌన్సిల్ ఆధీనంలో ఉన్న శిబిరాలపై సౌదీ అరేబియా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఏడెన్ విమానాశ్రయం నుండి వెళ్లే విమానాలు తప్పనిసరిగా సౌదీలోని జెద్దాలో తనిఖీలకు ఆగాలని ఆదేశించింది. ఇది సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే చర్య.
తాజా విభేదం: మిత్రదేశాల మధ్యే పోరు?
యెమెన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రెండు గ్రూపుల మధ్య యుద్ధం కాదు, ఇది అనేక దేశాల ప్రయోజనాలు, అంతర్గత విభేదాల సంక్లిష్ట కలయిక.
దశాబ్దకాలంగా యెమెన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా రెండు పక్షాలు ఉన్నాయి. ఉత్తర యెమెన్‌ను నియంత్రిస్తున్న ఇరాన్ మద్దతు హౌతీల గ్రూపు ఒకవైపు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సౌదీ అరేబియా, యూఏఈ నేతృత్వంలోని కూటమి మరోవైపు ఉన్నాయి.
గతంలో హౌతీలకు వ్యతిరేకంగా పోరాడిన సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తాయి. దీనికి కారణం వారు మద్దతు ఇస్తున్న స్థానిక దళాల ఆశయాలు వేరుగా ఉండటమే. సౌదీ అరేబియా మద్దతు, యెమెన్ అధికారిక ప్రభుత్వానికి ఇస్తుంది. (దీనిని ప్రస్తుతం 'నేషనల్ షీల్డ్ ఫోర్సెస్' రక్షిస్తున్నాయి). వీరు యెమెన్ దేశం అంతా ఒకటిగా ఉండాలని కోరుకుంటారు.
యూఏఈ మద్దతు, సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కు ఇస్తుంది. వీరు 1990కి ముందు ఉన్నట్లుగా దక్షిణ యెమెన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. శుక్రవారం సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించిన రాజ్యాంగం ఈ వివాదాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ, యూఏఈ కలిసి పోరాడుతున్నప్పటికీ, ఇప్పుడు వారి మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇది అరబ్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశమైన యెమెన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ప్రస్తుత పరిస్థితి:
గత నెలలో సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దళాలు ఏడెన్‌లోని అధ్యక్ష భవనాన్ని, రెండు ప్రావిన్సులను, సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ దళాల నుండి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ సభ్యులు సౌదీ రాజధాని రియాద్‌కు పారిపోయారు. తాజాగా, ఏడెన్ విమానాశ్రయానికి వచ్చే విమానాలు సౌదీలోని జెద్దాలో తనిఖీలకు వెళ్లాలని సౌదీ అరేబియా నిబంధనలు విధించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి నిరసనగా యూఏఈకి విమాన సర్వీసులను సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ నిలిపివేసింది.
యూఏఈ దళాల ఉపసంహరణ వెనుక మర్మం ఏమిటి?
యూఏఈ తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు.అంతర్జాతీయ ఒత్తిడి కావచ్చు. యెమెన్ విభజనకు తాము కారణం కాదని ప్రపంచానికి చూపించుకోవడం కోసం కావచ్చని నిపుణుల అభిప్రాయం. నేరుగా సైన్యాన్ని ఉంచకుండా, తాము శిక్షణ ఇచ్చిన ఎస్టిసి దళాల ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం పరోక్ష యుద్ధం చేయవచ్చు.
దీని ప్రభావం ఏమిటి?
ఈ పరిణామాలు యెమెన్ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెట్టాయి. ఇప్పటికే హౌతీల వశంలో ఉత్తర యెమెన్ ఉండగా, ఇప్పుడు దక్షిణ యెమెన్ కూడా విడిపోతే దేశం మూడు, నాలుగు ముక్కలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ అంతర్గత పోరు వల్ల సామాన్య ప్రజలకు అందాల్సిన ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
