Let's talk: editor@tmv.in
సౌదీ బస్సు విషాదం: 38 మంది బంధువులు జెడ్డా చేరిక

సౌదీ బస్సు విషాదం: 38 మంది బంధువులు జెడ్డా చేరిక

Gaddamidi Naveen
20 నవంబర్, 2025

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు, మొత్తం 38 మంది బంధువులు బుధవారం జెడ్డా చేరుకున్నారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మదీనా సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సుకు మంటలు అంటుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనలో కనీసం 45 మంది భారతీయులు, వారిలో ఎక్కువమంది హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులని స్థానిక వర్గాలు తెలిపాయి. అయితే, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ సంఖ్యను 42గా పేర్కొన్నాయి.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, అంత్యక్రియలు శుక్రవారం జరిగే అవకాశం ఉంది. 38 మంది జెడ్డాకు చేరుకున్నారు. వారికి డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారిక ప్రక్రియ అనంతరం, శుక్రవారం అంత్యక్రియలు జరగవచ్చు, అని వర్గాలు వెల్లడించాయి.

బాధితుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు సౌదీ అధికారులతో సమన్వయం చేసేందుకు, మృత‌దేహాల‌ అప్పగింత అంత్యక్రియల ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం గల్ఫ్ దేశంలోనే అక్కడే ఉంది.ప్రమాదంలో ఏకైక జీవించి బయటపడ్డ మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఆరోగ్యం గురించి అడిగితే, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం జెడ్డాలోని సౌదీ జర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. బుధవారం ఆయన సౌదీ అరేబియాలో భారత రాయబారి సుహేల్ అజాజ్ ఖాన్తో మాట్లాడినట్టు చెప్పారు. రాయబారి ప్రస్తుతం మదీనాలోనే ఉంటూ, తెలంగాణ మైనారిటీల సంక్షేమ మంత్రి అజారుద్దీన్, సౌదీ అధికారులతో కలిసి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. అదనంగా,మరికొంత మంది బాధితుల బంధువులు కూడా మదీనాకు వెళ్లుతున్నారని, ఈ మొత్తం ప్రాసెస్‌ను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నేరుగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.