సౌదీ బస్సు ప్రమాదం: అంత్యక్రియల కోసం హైదరాబాద్ నుంచి బాధితుల కుటుంబాల ప్రయాణానికి ఏర్పాట్లు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణకు చెందిన హజ్ యాత్రికుల కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సుమారు 50 మంది కుటుంబ సభ్యులు అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు అని సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. అంత్యక్రియలు గురువారం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రమాదం తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని పర్యవేక్షించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజరుద్దీన్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ బృందం ఇప్పటికే సౌదీ అరేబియా చేరుకుంది.ఈ బృందం అంత్యక్రియలు, పత్రాల నిర్వహణ, ఇతర సహాయక చర్యలను సమన్వయం చేస్తోందన్నారు.ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించడానికి వీలు లేకుండా మారాయి.దీంతో మరణ ధృవీకరణ పత్రాలను ఖరారు చేయడానికి, కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు చేరుకున్న తర్వాత నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడానికి డీఎన్ఏ మ్యాచింగ్ చాలా కీలకం అని ఆయన పేర్కొన్నారు.
సౌదీ ప్రభుత్వం కూడా బాధితుల కుటుంబాలకు పరిహారం అందించే అవకాశం ఉందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసహాయం, ప్రయాణ భత్యం వంటి అంశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.డీఎన్ఏ ధృవీకరణ తర్వాత కుటుంబాలకు రెవెన్యూ శాఖ తరఫున అవసరమైన పత్రాలు కూడా జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.అధికారి తెలిపిన వివరాల ప్రకారం,మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అంత్యక్రియలను అక్కడే మతపరమైన సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది.
ఈ ప్రమాదంలో 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల, అంత్యక్రియలు సౌదీ అరేబియాలోనే, వారి మతపరమైన సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదనంగా, మరణించిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
