Let's talk: editor@tmv.in
సౌదీలో బస్సు ప్రమాదం:45 మంది హైదరాబాదీల మృతి

సౌదీలో బస్సు ప్రమాదం:45 మంది హైదరాబాదీల మృతి

Gaddamidi Naveen
18 నవంబర్, 2025

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న డిజీల్ ట్యాంకర్ ను ఢీకొని ఓ బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో ఉన్న 46 మందిలో 45 మంది సజీవ దహనమయ్యారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన సుమారు 18 మంది మృతి చెందారు. కుటుంబంతో సహ మక్కా యాత్రకు వెళ్లిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి షేక్ నజీరుద్దీన్ కుటుంబం ఈ ఘోర దుర్ఘటనలో అసువులు బాసింది. ఏపీలోని కర్నూల్ లో జరిగిన మంటలకు అహుతైన దారుణ బస్సు ఘటన మరవకముందే మరో ప్రమాదం దేశాన్ని దిగ్ర్బామకు గురిచేసింది. ఈ ప్రమాదం దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు నివాసితులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కుటుంబ వాసులు బస్సులోనే!

సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో ఆయిల్‌ ట్యాంకర్‌తో ఢీకొన్న బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రయాణిస్తున్నట్టు వారి బంధువులు వెల్లడించారు. మూడు తరాలు కలిసి చేసిన ఈ యాత్ర ఘోర విషాదంగా మారింది. రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి షేక్‌ నజీరుద్దీన్ తన భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, మనుమలు మనవరాళ్లతో కలిసి మదీనా వైపు ప్రయాణిస్తున్నారని ఆయన మేనల్లుడు మొహమ్మద్‌ అస్లాం చెప్పారు. ప్రమాదం జరిగిన ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియలేదని, కానీ మొత్తం 18 మంది ఒక్క కుటుంబానికి చెందిన వారేనని ఆయన తెలిపారు.

ఇది ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? స్పష్టత లేదు. కానీ నజీరుద్దీన్‌, ఆయన కుమారుడు, కుమార్తెలు, మనుమలతో పాటు మొత్తం 18 మంది బస్సులో ఉన్నారు అని అస్లాం అన్నారు.నజీరుద్దీన్‌ మరో కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, అలాగే ఈ యాత్రికులను సౌదీకి తీసుకెళ్లిన ట్రావెల్‌ ఏజెన్సీపై కూడా విచారణ చేపట్టాలని అస్లాం డిమాండ్‌ చేశారు.

రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రియాద్‌లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులు కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని ఆయన తెలియజేశారు.

అసదుద్దీన్ ఓవైసీ స్పందన

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్‌కు చెందిన పలువురు ట్రావెల్‌ ఏజెన్సీలతో మాట్లాడి ప్రయాణికుల జాబితాలు సేకరించి రాయబారి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. కేంద్రం మరణించిన వారి మృతదేహాలను భారతికి రప్పించాలని కోరారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దుర్ఘటనపై కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయం అందిస్తుందని కేబినెట్ పేర్కొన్నారు.

మంత్రి అజారుద్దీన్‌, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది.చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలను మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

సౌదీ బస్సు ప్రమాదం: పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందన

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది మృతి చెందినట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు.

పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం,నవంబర్ 9న హైదరాబాద్‌ నుంచి మొత్తం 54 మంది జెడ్డాకు ప్రయాణించినట్టు తెలిపారు. నవంబర్‌ 23న తిరిగి రావాల్సి ఉందని చెప్పారు. ఇందులో నలుగురు వ్యక్తులు ఆదివారం కారులో మదీనా వెళ్లగా, మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారని తెలిపారు.మిగిలిన 46 మంది మదీనాకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తుండగా, ఆ బస్సు నగరానికి 25 కి.మీ దూరంలో ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం భారీ ప్రాణ నష్టం కలిగించిందని కమిషనర్ పేర్కొన్నారు.ప్రమాదంలో మొహమ్మద్ అబ్దుల్ షోయిబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డార‌ని. ఆయను ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.ప్రాథమిక సమాచారం ప్రకారం 45 మంది మరణించారు. నవంబర్ 23న వీరందరూ హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉందని సజ్జనార్ చెప్పారు.

ముఖ్యమంత్రి స్పందన

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు,డీజీపీ శివధర్ రెడ్డిని సంప్రదించి,వారు నేరుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సౌదీలో ఉన్న భారత రాయబారి కార్యాలయాలను సంప్రదించాలని ఆయ‌న‌ సూచించారు.ఈ చర్యల ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల సంఖ్య, వారి పరిస్థితిపై ఖచ్చితమైన సమాచారం త్వరితగతిన అందించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాదంపై సమాచారాన్ని అందించడానికి హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక నియంత్రణ గదిని (కంట్రోల్ రూమ్) ఏర్పాటు చేసింది.కుటుంబ సభ్యులు 91 79979 59754, 91 99129 19545.ఈ నంబర్ల ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.అలాగే జెడ్డాలోని భారతీయ ఎంబసీలో: 80024 40003 ఇతర నంబర్లు కూడా ఉన్నాయి.