
సౌదీతో అమెరికా వ్యూహాత్మక డీల్: పెట్టుబడులు, రక్షణ సహకారం బలోపేతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) మధ్య చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు అమెరికా-సౌదీ సంబంధాలను పూర్తిగా పునరుద్ధరించడమే కాక, పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా రాజకీయ, సైనిక ప్రాధాన్యత మారుతున్న సంకేతాలను స్పష్టంగా ఇస్తున్నాయి. ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా వైట్ హౌస్‌కు విచ్చేసిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ రాజమర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో అత్యంత కీలకమైన, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ప్రకటన ఏమిటంటే.. అత్యంత అధునాతన యుద్ధ విమానాలైన ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను సౌదీ అరేబియాకు విక్రయించడానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమాసియాలో ఎఫ్-35 విమానాలను పొందే ప్రత్యేక హక్కు ఇజ్రాయెల్‌కు మాత్రమే ఉండేది. దీని ద్వారా ఇజ్రాయెల్ గగనతలంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ప్రత్యేక హక్కును ముగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ సైనిక సమతుల్యతను మార్చగలదు.
ఇజ్రాయెల్-సౌదీ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, అమెరికా వైఖరి మారినా ఇజ్రాయెల్ ఇప్పటివరకు మౌనం వహించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎఫ్-35 విమానాల అమ్మకాన్ని ట్రంప్ సౌదీ-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అభిప్రాయం. సౌదీ-చైనా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమాన సాంకేతికత చైనా చేతుల్లో పడే అవకాశముందని అమెరికా అధికారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో తమ పెట్టుబడులను 600 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి దాదాపు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు, డేటా కేంద్రాలు, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాలపై ఈ పెట్టుబడులు ప్రధానంగా దృష్టి సారిస్తాయని ఆయన తెలిపారు.
పౌర అణు శక్తి సహకారంపై సంయుక్తంగా సంతకం చేశారు. ఇది దశాబ్దాల పాటు కొనసాగే అణుశక్తి భాగస్వామ్యానికి పునాది వేస్తుంది. అమెరికా సంస్థలు సౌదీకి ప్రాధాన్య భాగస్వాములుగా ఉంటారు. అలాగే బ్యాటరీలు, చిప్ తయారీలో కీలకమైన ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసే ఒప్పందంపై కూడా సంతకం జరిగింది.
మరోవైపు అమెరికా -సౌదీ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది రక్షణ సహకారాన్ని పెంచడంతో పాటు, సౌదీ దాదాపు 300 అమెరికన్ ట్యాంకులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఈ ఒప్పందాలన్నీ అమెరికన్లకు అధిక వేతన ఉద్యోగాలను, పరిశ్రమలకు భద్రతను కల్పిస్తాయని వైట్ హౌస్ పేర్కొంది.
అబ్రహం ఒప్పందాలపై షరతు
ప్రస్తుతం ట్రంప్ దృష్టంతా ‘అబ్రహం’ ఒప్పందం విస్తరణపైనే ఉంది. గతంలో కుదిరిన ఈ ఒప్పందంలో యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ దేశాలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. ఈ ఒప్పందంలో చేరడానికి సౌదీ అరేబియా సుముఖత వ్యక్తం చేసింది. అయితే పాలస్తీనా దేశం ఏర్పడటం వైపు స్పష్టమైన పురోగతి సాధించిన తర్వాతే ఇది సాధ్యమవుతుందని సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో సౌదీని కూడా చేర్చడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ట్రంప్‌కు ఉంది. ఇది విజయవంతమైతే నోబెల్ శాంతి బహుమతి కల కోసం ట్రంప్ దీనిని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.
ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య వివాదం చాలా కాలంగా అమెరికా, సౌదీ అరేబియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారి 2018లో వైట్‌హౌస్‌ను సందర్శించినప్పుడు ఇదే అంశంపై ఇరు పక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ఖషోగ్గి హత్య ఆపరేషన్‌లో బిన్ సల్మాన్ ప్రమేయం ఉండవచ్చని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే సౌదీ ప్రభుత్వం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ అంశాన్ని వైట్ హౌస్ లో ప్రస్తావించిన విలేకరులకు ట్రంప్, అందులో సౌదీ యువరాజు పాత్ర లేదని స్పష్టం చేశారు.
మొత్తంగా ఆర్థిక, సైనిక సహకారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఈ తాజా ఒప్పందాలు గత పరిపాలనల్లో సంబంధాలను దెబ్బతీసిన మానవ హక్కుల ఆందోళనల కంటే వ్యూహాత్మక ప్రయోజనాలకే అమెరికా పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేస్తున్నాయి.
