
సౌత్ సెంట్రల్ రైల్వే సరికొత్త ముందడుగు: ఇంటి నుంచే పార్శిల్ బుకింగ్!
దక్షిణ మద్య రైల్వే బుధవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో ‘రైల్ పార్సెల్ యాప్’ పైలట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించింది. భారతీయ రైల్వేల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే పార్సెల్ బుక్ చేసి, డోర్-టు-డోర్ పికప్, డెలివరీ సేవలను పొందే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం రైల్వే సరుకు రవాణా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం తమ జోన్‌ను రైల్వే బోర్డు ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి తమ బృందాలు, పరిశ్రమ భాగస్వాముల కృషే కారణమని చెప్పారు. తక్కువ సమయంలోనే సాంకేతిక సవాళ్లను అధిగమించి, కేవలం నాలుగు నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించిన హెడ్ క్వార్టర్స్ టీం, కమర్షియల్, ఫైనాన్స్, హైదరాబాద్ డివిజన్ బృందాలను ఆయన అభినందించారు.
సాంకేతికత ఆధారంగా ఈ యాప్ మూడు ప్రధాన సౌకర్యాలను అందిస్తుందని శ్రీవాస్తవ వివరించారు. అవి, డోర్-టు-డోర్ పార్సెల్ పికప్, డెలివరీ, ఆన్‌లైన్ ద్వారా సులభంగా బుకింగ్ చేసే అవకాశం, అలాగే పార్సెల్ ఎక్కడ ఉందో తెలుసుకునే పూర్తి స్థాయి ట్రాకింగ్ (విజిబిలిటీ). ఈ సేవలతో వినియోగదారులకు పార్సెల్ రవాణా మరింత సులభంగా, పారదర్శకంగా మారుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను దేశంలోని ఏడు నగరాల్లో ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చే స్పందన, సూచనల ఆధారంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. భారతదేశంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఇంటి నుంచే పార్సెల్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలన్నదే రైల్వే దీర్ఘకాలిక దృష్టి అని స్పష్టం చేశారు.
ఐఐఎం బెంగళూరుతో కీలక ఒప్పందం
ఇదే సమయంలో, సరుకు రవాణా, లాజిస్టిక్స్ మార్కెట్‌పై లోతైన అధ్యయనం కోసం దక్షిణ మధ్య రైల్వే ఐఐఎం బెంగళూరుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే వంటి భారీ సంస్థ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేతులు కలపడం వల్ల వినూత్న ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని శ్రీవాస్తవ తెలిపారు. ఐఐఎం పరిశోధనలు రైల్వేకు కొత్త దిశను చూపిస్తాయని, అలాగే విద్యార్థులకు రైల్వే ఒక వాస్తవిక ప్రయోగశాలగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకింగ్, లాజిస్టిక్ భాగస్వామ్యం
ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ భాగస్వామిగా వ్యవహరించగా, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో క్రిస్ ఇతర లాజిస్టిక్ భాగస్వాములు కీలక పాత్ర పోషించారు. పరిశ్రమల భాగస్వామ్యం, ప్రభుత్వ సంస్థల సమన్వయంతోనే ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు సాధ్యమవుతాయని, దీనివల్ల రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
