Let's talk: editor@tmv.in
సోషల్ మీడియా విన్నపానికి పవన్ కళ్యాణ్ స్పందన: గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు

సోషల్ మీడియా విన్నపానికి పవన్ కళ్యాణ్ స్పందన: గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు

Panthagani Anusha
8 ఫిబ్రవరి, 2026

పవన్ సార్.. మా ఊరికి రోడ్డు వేయించండి.. స్కూలుకు వెళ్లలేకపోతున్నాం అంటూ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా చేసిన చిన్న విన్నపం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. బురదమయమైన బాటలో విద్యార్థులు పడుతున్న అవస్థలు చూసి చలించిన ఆయన తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు, తమ గ్రామానికి సరైన రహదారి లేక పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఇబ్బందులను వివరిస్తూ వారు చేసిన వీడియో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీనిపై ఆయన తక్షణమే జిల్లా కలెక్టర్‌తో సమీక్షించి, యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందించాలని సూచించారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకూడదని వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేయడంతో యంత్రాంగం వేగంగా కదిలింది.

ఉప ముఖ్యమంత్రి ఆదేశించిన కొద్ది గంటల్లోనే గజ్జలవారిపల్లికి 1.6 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసి ఆర్డర్లు జారీ చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే విద్యార్థులకే కాకుండా పంట పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి రవాణా కష్టాలు తీరనున్నాయి. ఒక చిన్న వీడియో విన్నపం గ్రామాభివృద్ధికి దారితీయడంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇప్పటికే ‘పల్లె పండగ’ 1.0, 2.0 కార్యక్రమాలతో పాటు సాస్కీ నిధుల ద్వారా సుమారు రూ. 55 కోట్ల విలువైన 641 రోడ్ల పనులను చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా దుత్తలూరు, కొండాపురం, సీతారాంపురం, వింజమూరు వంటి కీలక మండలాల్లో ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.9 కోట్లు కేటాయించారు. గజ్జలవారిపల్లి రోడ్డు కూడా ఈ అభివృద్ధి బాటలో చేరడంతో ఆ ప్రాంత రవాణా వ్యవస్థకు కొత్త రూపు రానుంది.

సోషల్ మీడియా విన్నపానికి పవన్ కళ్యాణ్ స్పందన: గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు - Tholi Paluku