
సోషల్ మీడియా మోసం.. 19 రాష్ట్రాల్లో 140 మందికి రూ.5.3 కోట్ల టోకరా
సోషల్ మీడియా వేదికగా మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ తక్కువ ధరలకే విక్రయిస్తామని నమ్మించి 19 రాష్ట్రాల్లోని సుమారు 140 మందిని మోసగించిన 22 ఏళ్ల సైబర్ నేరస్థుడిని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని జాలౌర్ జిల్లాకు చెందిన ప్రకాష్ కుమార్ అనే వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.1 లక్ష నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన ఒక మొబైల్ షాపు యజమాని జులై నెలలో తన దుకాణానికి కావలసిన ఛార్జర్లు, డిస్‌ప్లేలు ఇతర స్పేర్ పార్ట్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వెతుకుతుండగా నిందితుడి ఖాతా కనిపించింది. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తే కొరియర్ ద్వారా సరుకు పంపిస్తామని నమ్మించడంతో, బాధితుడు జులై 25 నుంచి ఆగస్టు 8 మధ్య విడతల వారీగా రూ. 2.18 లక్షలు చెల్లించాడు. నిందితుడు మెసేజింగ్ యాప్ ద్వారా ఒక నకిలీ కొరియర్ రశీదును పంపి పార్సిల్ అందుతుందని నమ్మించాడు. ఆగస్టు 22న కొరియర్ ఆఫీసుకు వెళ్లిన బాధితుడికి ఎలాంటి పార్సిల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
రూ. 5.30 కోట్ల భారీ స్కామ్
పోలీసుల లోతైన దర్యాప్తులో నిందితుడు ప్రకాష్ కుమార్ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని దాదాపు 140 మంది వ్యాపారులను, ప్రజలను ఇదే తరహాలో మోసగించి సుమారు రూ. 5.30 కోట్లకు పైగా కాజేసినట్లు తేలింది.సోషల్ మీడియా వేదికల్లో అనుమానాస్పద ఖాతాల ద్వారా అత్యంత తక్కువ ధరకు ఉత్పత్తులను ఆఫర్ చేసే అపరిచిత వ్యక్తులకు ముందస్తుగా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవద్దని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
