
సోషల్ మీడియా నియంత్రణపై ఏపీ ఫోకస్
ఆన్‌లైన్ ప్రపంచంలో పెరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సురక్షితంగా మార్చే లక్ష్యంతో మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) తదుపరి సమావేశానికి గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ డిజిటల్ పాలనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి
కాగా ఈ సమావేశానికి మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), షేర్‌చాట్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులను ప్రభుత్వం పిలిచింది. ప్లాట్‌ఫామ్ జవాబుదారీతనం, మైనర్లకు రక్షణ కల్పించడం, ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని అరికట్టే వ్యూహాలు వంటి అంశాలపై వీరితో నేరుగా చర్చించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజిటల్ భద్రతా నియమాలను రూపొందించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
పిల్లల వ్యసనం.. మహిళల వేధింపులపై ఆందోళన
మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా సోషల్ మీడియా దుష్ప్రభావాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై ప్రజల్లో నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పిల్లలు మితిమీరిన వ్యసనానికి గురవుతున్నారని ఇది వారి విద్యా సామర్థ్యాన్ని, ఏకాగ్రతను దెబ్బతీస్తోందని గుర్తు చేశారు. అదేవిధంగా మహిళలు నిరంతరం ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులను ఇకపై విస్మరించలేమని బాధ్యతాయుతమైన డిజిటల్ వ్యవస్థను నిర్మించడం తమ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాల విధానాలపై సమగ్ర అధ్యయనం
కాగా ఈ విషయమై ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న చట్టపరమైన చట్రాలను సమీక్షించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ దేశాలలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులను ముఖ్యంగా పిల్లలకు వయస్సు ఆధారిత యాక్సెస్‌ను ఎలా నియంత్రిస్తున్నారనే అంశంపై దేశాల వారీ విశ్లేషణ నిర్వహించనున్నారు. ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్తులో తీసుకోబోయే విధాన నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
లక్ష్యం నియంత్రణ కాదు.. బాధ్యతాయుత వ్యవస్థ
ఈ చర్యల ఉద్దేశం సోషల్ మీడియాను నియంత్రించడం లేదా ఆంక్షలు విధించడం కాదని మరింత పారదర్శకమైన,బాధ్యతాయుతమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడమేనని మంత్రుల బృందం పునరుద్ఘాటించింది. హానికరమైన కంటెంట్ నుంచి బాల్యాన్ని రక్షించడం, మహిళలకు గౌరవప్రదమైన డిజిటల్ వేదికలను అందించడం ప్రజల్లో మళ్ళీ నమ్మకాన్ని పునరుద్ధరించడమే ఈ బృహత్తర ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యం.
