Let's talk: editor@tmv.in
సోషల్ మీడియాలో అతివాద ప్రచారం: విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్ట్

సోషల్ మీడియాలో అతివాద ప్రచారం: విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్ట్

Panthagani Anusha
25 మార్చి, 2026

సోషల్ మీడియా వేదికగా అతివాద భావజాలాన్ని నూరిపోస్తూ యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు . ఏపీ ఇంటెలిజెన్స్, విజయవాడ టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ గుట్టురట్టయింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ రాడికలైజేషన్ (తీవ్రవాద భావజాల వ్యాప్తి) పట్ల భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్న తరుణంలో ఈ ముఠా పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది.

కాగా అరెస్టైన వారిని మొహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్ (23), మిర్జా సోహైల్ బేగ్ (23), మొహమ్మద్ దానిష్ (27) గా పోలీసులు గుర్తించారు. వీరు విజయవాడలోని టూ టౌన్ పరిధిలో నివసిస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం పోలీసులు వీరి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

డిజిటల్ వేదికలపై విషప్రచారం

పోలీసుల కథనం ప్రకారం ఈ ముగ్గురు నిందితులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను అస్త్రాలుగా చేసుకుని అతివాద భావజాలాన్ని ప్రోత్సహించే పోస్టులు, వీడియోలు, సందేశాలను విస్తృతంగా ప్రచారం చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల రాడికల్ కంటెంట్‌పై భద్రతా సంస్థలు పెంచిన నిఘాలో వీరి అనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.

దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో సంబంధాలు?

ప్రాథమిక దర్యాప్తులో వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సుమారు 10 మంది సభ్యుల కీలక నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ ప్రధాన లక్ష్యం ఆన్‌లైన్ ద్వారా యువతను గుర్తించి వారిని అతివాద కార్యకలాపాల వైపు మళ్లించడమేనని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో వీరికి ఏవైనా ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

నిందితుల అరెస్టు అనంతరం విజయవాడ పోలీస్ ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. "నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే సైబర్ ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపాము. ఈ డిజిటల్ ఆధారాల ద్వారా వారి నెట్‌వర్క్ లోతుపాతులను వెలికితీస్తాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే విద్వేషపూరిత పోస్టులు, సందేశాల పట్ల యువత మరియు తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, అని ఆయన సూచించారు.

ప్రస్తుతం నిందితులపై దేశ భద్రతకు సంబంధించిన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించడంతో, ముందస్తు జాగ్రత్తగా విజయవాడలోని ప్రధాన కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో పోలీసులు భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, ఆన్‌లైన్ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ విభాగం నిశితంగా పరిశీలిస్తోంది.