Let's talk: editor@tmv.in
సోషల్ మీడియాకు తలొగ్గిన బీసీసీఐ:ఖండించిన శశిథరూర్

సోషల్ మీడియాకు తలొగ్గిన బీసీసీఐ:ఖండించిన శశిథరూర్

Praveen Kumar
4 జనవరి, 2026

సోషల్ మీడియా దెబ్బకు బీసీసీఐ తలొగ్గింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్ కేకేఆర్ టీం తీసుకున్న ముస్తఫిజుర్ రహ్మాన్ ను తొలగించాలని సోషల్ మీడియాలో కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్ ను ట్రోల్ చేశారు. అలాగే బీసీసీఐను నెటిజన్లు వెంటాడారు. దీంతో బీసీసీఐ రహ్మన్ ను టీం నుంచి విడుదల చేసి, అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సూచించింది.

భారత్–బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజూర్ రహ్మాన్‌ను తమ జట్టు నుంచి విడుదల చేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)‌ను ఆదేశించింది.

ఈ ఆదేశం జనవరి 3, 2026 ఉదయం జారీ కాగా, ఎలాంటి గడువు నిర్దేశించకపోయినా, దీనిని తక్షణ అమలులోకి తీసుకోవాల్సిన ఆదేశంగా పరిగణించారు. బీసీసీఐ నుంచి సూచనలు అందిన రెండు గంటల వ్యవధిలోనే ముస్తఫిజూర్‌ను విడుదల చేసినట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.

గత నెల జరిగిన ఐపీఎల్ వేలంలో, రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో బరిలోకి దిగిన 30 ఏళ్ల ఎడమచేతి పేసర్ ముస్తఫిజూర్ రహ్మాన్‌ను, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తీవ్ర పోటీ బిడ్డింగ్ అనంతరం కేకేఆర్ రూ.9.20 కోట్లకు సొంతం చేసుకుంది.

ఈ పరిణామాలను ధృవీకరిస్తూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, కేకేఆర్‌కు ముస్తఫిజూర్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

“కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులోని ముస్తఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. వారు కోరితే ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది,” అని సైకియా తెలిపారు.

ఈ నిర్ణయానికి కారణాలపై ప్రశ్నించగా, “ఇటీవలి పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు,” అని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక హిందూ వ్యక్తి హత్య ఘటనతో పాటు, అక్కడి మైనారిటీల భద్రతపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో, బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్‌లో పాల్గొనడంపై బీసీసీఐపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.

కేకేఆర్ కూడా ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేస్తూ, బీసీసీఐ ఆదేశాలను అమలు చేసినట్లు వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను ఐపీఎల్ , బీసీసీఐ త్వరలో వెల్లడిస్తాయని తెలిపింది.

ఐపీఎల్ 2026 సీజన్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

క్రీడలను రాజకీయాలతో కలపొద్దు: శశిథరూర్‌

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించిన ఘటనపై కాంగ్రెస్‌ నేతలు శశి థరూర్‌, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయానికి బీజేపీతో పాటు బీసీసీఐ బాధ్యత వహించాలని వారు విమర్శించారు.

ఈ పరిణామంపై శశి థరూర్‌ సోషల్‌ మీడియా వేదిక ఎక్స్ లో స్పందిస్తూ, క్రీడలను మతం, జాతీయత, రాజకీయాలతో కలపొద్దని హెచ్చరించారు. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌పై బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత దురదృష్టకరం. అతని స్థానంలో లిటన్‌ దాస్‌ లేదా సౌమ్య సర్కార్‌ ఉంటే కూడా ఇదే జరిగేదా? ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఒక దేశమా? ఒక వ్యక్తియా? లేక అతని మతమా? క్రీడలకు ఇలా రాజకీయ రంగు పూయడం చివరకు ఎక్కడికి తీసుకెళ్తుంది? అని థరూర్‌ ప్రశ్నించారు.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులపై వచ్చిన నివేదికల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారని పేర్కొంటూ, ఇతర దేశంలో జరిగిన ఘటనలకు ఒక క్రీడాకారుడిని బాధ్యుడిని చేయడం అన్యాయమని థరూర్‌ స్పష్టం చేశారు. ముస్తాఫిజుర్‌ ఒక క్రికెటర్‌ మాత్రమే. అతనిపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేష ప్రసంగాలు చేసినట్టు లేదా దాడులను సమర్థించినట్టు ఆరోపణలు లేవు. ఇలాంటి విషయాలను క్రికెట్‌తో కలపడం సరైంది కాదని ఆయన తెలిపారు. అలాగే పొరుగు దేశాలను దూరం పెట్టే విధానం భారతదేశ దీర్ఘకాల ప్రయోజనాలకు హానికరమని థరూర్‌ అభిప్రాయపడ్డారు. మన చుట్టూ ఉన్న అన్ని దేశాలను వేరుచేస్తే భారత్‌కు ఏమి లాభం? ఇది పూర్తిగా క్రీడాపరమైన నిర్ణయమే కావాలి. రాజకీయాలను ఇందులోకి తేవద్దు అని ఆయన అన్నారు.

నిబంధనలు రూపొందించేదెవరు?

ఈ అంశంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కూడా స్పందిస్తూ, బీసీసీఐ, ఐసీసీ, కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రశ్నించారు. ఆరంభంలోనే ఆటగాళ్లు పాల్గొనడంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి. ఫ్రాంచైజీ లేదా యజమానులను ప్రశ్నించడం ఎందుకు? నియమాలు రూపొందించేది బీసీసీఐ, వాటిని పర్యవేక్షించేది ఐసీసీ. మరి బీసీసీఐని, ఐసీసీని లేదా కేంద్ర హోం మంత్రిని ఎందుకు ప్రశ్నించరని ఖర్గే నిలదీశారు. అలాగే, జాతీయవాదాన్ని ఎంపిక చేసుకుని లాభాల కోసం వాడుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీసీసీఐకి నిజంగా ప్రజల భావోద్వేగాలపై శ్రద్ధ ఉంటే, ఐపీఎల్‌ వేలాలు విదేశాల్లో ఎందుకు జరుగుతున్నాయి? కోవిడ్‌ సమయంలో అబుదాబీలో ఐపీఎల్‌ ఎందుకు నిర్వహించారు? ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ లేదా ఎన్‌ఎఫ్‌ఎల్‌ తమ వేలాలను విదేశాల్లో నిర్వహించవు కదా అని ఆయన ప్రశ్నించారు.

కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ను ‘దేశద్రోహి’గా ముద్ర వేస్తున్న బీజేపీ నేతలపై కూడా ఖర్గే మండిపడ్డారు. చట్టాన్ని పాటిస్తే ఎవరైనా దేశద్రోహులైతే, ఆ చట్టాన్ని రూపొందించిన వారినీ అలాగే పిలవాలి. కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించకుండా, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని వివరించారు.