Let's talk: editor@tmv.in
సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ

సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ

Gaddamidi Naveen
25 జులై, 2026

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండల సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన, విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లాగ్‌బుక్‌ను పరిశీలించి రైతులకు రోజుకు ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు మళ్లీ బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

సోలేపేట సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను అడిగితే గతంలో 14 నుంచి 15 గంటల వరకు విద్యుత్ సరఫరా చేశామని, అయితే ఈ వారం నుంచి ప్రభుత్వం ఆదేశాల మేరకు కేవలం 12 గంటలు మాత్రమే ఇవ్వాలని సూచించారని చెప్పారని హరీష్ రావు తెలిపారు. ఆ 12 గంటల సరఫరాలోనూ పలుమార్లు ట్రిప్పింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారని, కానీ సబ్‌స్టేషన్ రికార్డులు మాత్రం 12 గంటల సరఫరానే చూపిస్తున్నాయని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో 270 మెగావాట్ల యూనిట్ నిలిచిపోయాయని, మొత్తం 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, రైతు బీమా అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. బొమ్మలరామారం మండలంలోనే పది రైతు బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,000 మంది రైతుల కుటుంబాలకు ఐదు నెలలుగా బీమా సొమ్ము అందలేదని పేర్కొంటూ, ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి, మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్ము తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన ఉత్పత్తిని వెంటనే పునరుద్ధరించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ తాగునీటి సరఫరా కల్పించాలని కోరారు.