
సోయా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ నియోజకవర్గంలో సోయాబీన్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో ఆదిలాబాద్ ప్రాంతంలో సోయాబీన్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన తెలిపారు. ఈ సీజన్‌లో సుమారు 6,200 మంది రైతుల నుంచి కేవలం 1.64 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ మాత్రమే కొనుగోలు జరగగా, గత ఏడాది ఇదే సమయంలో 3.40 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు జరిగినట్లు గుర్తు చేశారు. ఈ తగ్గుదల రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు.
కోత దశలో నిరంతర వర్షాలు కురవడం వల్ల సోయాబీన్ పంట రంగు మారిందని, దీనిని సాకుగా చూపిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ఫెయిర్ అవరేజ్ క్వాలిటీ నిబంధనల పేరుతో పంటను తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతుల తప్పిదం లేకుండానే పంట నాణ్యతలో మార్పులు వస్తే, వాటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కనీస మద్దతు ధర కింద రంగు మారిన సోయాబీన్‌ను కూడా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే కొనుగోలు లక్ష్యాలు పూర్తయ్యాయని చెప్పుతూ పలు కొనుగోలు కేంద్రాల్లో సోయాబీన్ కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాయల్ శంకర్ పేర్కొన్నారు. దీంతో రైతులు దళారుల వద్దకు వెళ్లి తక్కువ ధరకు తమ పంటను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు మరింత నష్టాన్ని కలిగిస్తున్నదని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మిగిలిన సోయాబీన్ మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని, కొనుగోళ్లలో సడలింపులు ప్రకటించాలని కోరారు.
అదే విధంగా, చనాక, కొరాట ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన రైతులు ఇప్పటికీ సరైన పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అర్హులైన రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల రక్షణే బీజేపీ ప్రధాన లక్ష్యమని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
