
‘సోమాలిలాండ్’ను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఇజ్రాయెల్
ఆఫ్రికా ఖండంలోని ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతంలో ఉన్న సోమాలిలాండ్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకు ప్రధాన కారణం.. ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించడమే. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం సోమాలియాను ఆగ్రహానికి గురిచేయడమే కాకుండా, అనేక అరబ్, ఆఫ్రికా దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ వివాదం ఎంతటి స్థాయికి చేరిందంటే, దీనిపై ఐక్యరాజ్యసమితిలో కూడా అత్యవసర చర్చలు మొదలయ్యాయి.
సోమాలిలాండ్ ఎక్కడ ఉంది?
సోమాలిలాండ్ అనేది సోమాలియాకు వాయువ్య భాగంలో ఉన్న ప్రాంతం. ఇది ఏడెన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఒకవైపు యెమెన్‌కు ఎదురుగా, మరోవైపు జిబౌటి దేశానికి సరిహద్దుగా ఉంది. ఎర్ర సముద్రం (రెడ్ సీ)-ఏడెన్ గల్ఫ్ మార్గంలో ఉండటంతో ఇది ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ భారీగా నౌకలు ప్రయాణిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
ఇప్పటికే మూడు దశాబ్దాలకు పైగా సోమాలిలాండ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు లభించలేదు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. 1991లో సోమాలియా నుంచి విడిపోయిన తర్వాత సోమాలిలాండ్‌ను అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఇజ్రాయెల్-సోమాలిలాండ్ ఒప్పందం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, విదేశాంగ మంత్రి గిడియోన్ సార్, సోమాలిలాండ్ అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మహ్మద్ అబ్దుల్లాహీ కలిసి పరస్పర గుర్తింపు పత్రంపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయం అబ్రహాం ఒప్పందాలకు అనుగుణంగా ఉందని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా చర్చిస్తానని తెలిపారు.
సోమాలియా తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ నిర్ణయంపై సోమాలియా తీవ్రంగా స్పందించింది. ఇది తమ సార్వభౌమత్వంపై దాడిగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను సోమాలియా స్వీకరించడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రపంచదేశాల స్పందన
ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 20కి పైగా దేశాలు, అలాగే ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ సంయుక్తంగా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తిరస్కరించాయి. ఈ చర్య హార్న్ ఆఫ్ ఆఫ్రికా, రెడ్ సీ ప్రాంతాల్లో శాంతి, భద్రతకు ముప్పుగా మారవచ్చని హెచ్చరించాయి. సిరియా కూడా ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వని అమెరికా
అమెరికా మాత్రం ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు ఇప్పటివరకూ మద్దతు ఇవ్వలేదు. సోమాలిలాండ్‌ను గుర్తించే ఆలోచన లేదని గతంలో స్పష్టం చేసింది. సోమాలియా భౌగోళిక సమగ్రతకు తాము కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో భద్రతా అంశాలపై సోమాలియాతో విభేదాలు ఉన్నప్పటికీ, ఈ విషయంలో తమ వైఖరి మారదని తెలిపింది.
సోమాలిలాండ్ చరిత్రను చూస్తే, 1960లో కొద్ది కాలం స్వతంత్ర దేశంగా ఉంది. అప్పట్లో ఇజ్రాయెల్‌తో పాటు 35 దేశాలు దీన్ని గుర్తించాయి. అనంతరం స్వచ్ఛందంగా సోమాలియాతో కలిసిపోయింది. కానీ 1991లో సోమాలియాలో అంతర్యుద్ధం చెలరేగిన తర్వాత మళ్లీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అప్పటి నుంచి స్వంత ప్రభుత్వం, కరెన్సీ, భద్రతా బలగాలతో పనిచేస్తోంది. సోమాలియాతో పోలిస్తే రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య పాలన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
అధికారిక గుర్తింపు లేకపోయినా, బ్రిటన్, టర్కీ, యూఏఈ, డెన్మార్క్, తైవాన్ వంటి దేశాలతో సోమాలిలాండ్ అనధికార సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గుర్తింపుతో ఈ ప్రాంతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో, ఈ నిర్ణయం వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. సార్వభౌమత్వం, భద్రత, ప్రాంతీయ ప్రభావం వంటి అంశాలపై అంతర్జాతీయంగా పెద్ద చర్చకు ఇది దారి తీసింది.
అబ్రహాం ఒప్పందాల ప్రస్తావనతో, ఇజ్రాయెల్ ఈ విధానాన్ని మధ్యప్రాచ్యానికి మాత్రమే కాకుండా ఆఫ్రికాకూ విస్తరించాలనుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య మార్గాలు, భద్రతా సహకారం, ఎర్ర సముద్రం ప్రాంతంలో ప్రభావాన్ని పెంచుకోవడమే దీని వెనుక ప్రధాన లక్ష్యంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
