
సోమాలియాలో కరువు విలయం: 65 లక్షల మంది ఆకలి కేకలు!
ఆఫ్రికా దేశం సోమాలియా కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాలు లేక పంటలు పండక, పశువులు చనిపోయి ఆ దేశ ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సుమారు 65 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారని సోమాలియా ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సంక్షోభం రోజురోజుకూ పెరుగుతుండటంతో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు.
పిల్లలే బాధితులు.. వలస బాట పడుతున్న జనం
ఆకలితో అలమటిస్తున్న వారిలో మూడో వంతుకు పైగా చిన్నారులే ఉండటం అత్యంత విషాదకరం. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరక్క వేలాది మంది తమ ఇళ్లను వదిలి మొగదిషు వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. రాజధాని నగరం శివార్లలో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాలు ఇప్పటికే నిండిపోయాయి. తమ పశువులు చనిపోయి, పొలాలు ఎండిపోయి బతుకుతెరువు కోల్పోయిన రైతులు, ఇప్పుడు కనీస ఆహారం కోసం కటకటలాడుతున్నారు.
సహాయం కరువు.. నిధుల కొరత
సోమాలియాలో కరువు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఐక్యరాజ్యసమితి మానవతా సమన్వయకర్త జార్జ్ కాన్వే పేర్కొన్నారు. నీటి ధరలు ఆకాశాన్నంటడం, ఆహార సరఫరాలు తగ్గిపోవడం, అంతర్జాతీయ సహాయం సరిపడా అందకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత కారణంగా ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) గతంలో అందిస్తున్న సాయాన్ని కూడా భారీగా తగ్గించాల్సి వచ్చిందని, కొత్త నిధులు రాకపోతే ఏప్రిల్ నాటికి ఆహార పంపిణీ పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏప్రిల్-జూన్ వర్షాలే ఏకైక ఆశ
వచ్చే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కురిసే వర్షాలు కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నప్పటికీ, అది తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు పడినా, సుమారు 55 లక్షల మంది ఇప్పటికీ తీవ్రమైన ఆహార సంక్షోభంలోనే కొనసాగే అవకాశం ఉందని అంచనా. వీరిలో 16 లక్షల మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల సర్వస్వం కోల్పోయిన సోమాలియా ప్రజలను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
