
సోమశిల ఎకో టూరిజం పార్కు... క్షేత్రస్థాయిలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన
తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు స్వయంగా బోటులో విహరించిన మంత్రి, అక్కడి వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది అందాలను వీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యాటక వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సోమశిల–శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్స్ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందిస్తోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడి వ్యూ పాయింట్ వద్ద కనిపించే ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయని చెప్పారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఎకో పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశిలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
సోమశిల ప్రాంతం కేవలం ఒక విహారకేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందిందని మంత్రి తెలిపారు. ఇక్కడ 15 శివాలయాల సముదాయం ఉండటం వల్ల భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని అన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఐదు గంటల పాటు సాగే ప్రత్యేక బోటింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో కృష్ణా నది తీర అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుందన్నారు.
అలాగే ఈ ప్రాంతంలో ఉన్న హరిత, మృగవాణి రిసార్ట్స్ పర్యాటకులకు బస చేయడానికి అద్భుతమైన వసతులను కల్పిస్తున్నాయని మంత్రి చెప్పారు. సమీపంలోని మల్లెల తీర్థం, పాలధార, పంచదార వంటి ప్రసిద్ధ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అపారమైన పర్యాటక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి వెల్లడించారు.
