Let's talk: editor@tmv.in
సోనియా ప్రేరణ, మన్‌మోహన్ సింగ్ దూరదృష్టి… కాంగ్రెస్ పాలనకు మార్గదర్శకం: సీఎం

సోనియా ప్రేరణ, మన్‌మోహన్ సింగ్ దూరదృష్టి… కాంగ్రెస్ పాలనకు మార్గదర్శకం: సీఎం

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంకల్పదాయినిగా నిలిచిన సోనియా గాంధీ ప్రేరణ, మాజీ ప్రధానమంత్రి డాక్ట‌ర్ మన్‌మోహన్ సింగ్ దూరదృష్టి తమ ప్రభుత్వానికి శాశ్వత మార్గదర్శకాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌లలో ఏర్పాటు చేసిన "తెలంగాణ తల్లి" విగ్రహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన తర్వాత ఆయన ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల సంకల్పంతో జన్మించిన తెలంగాణ రాష్ట్ర స్థాపనలో సోనియా గాంధీ పోషించిన పాత్రను సీఎం మరోసారి స్మరించారు. డిసెంబర్ 9 తేదీ తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన రోజని, ఎందుకంటే 2009లో ఇదే రోజున అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన చేసిన సందర్భంగా గుర్తుచేశారు. ఇందుకు గుర్తుగా, ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న "తెలంగాణ తల్లి" విగ్రహాల ఆవిష్కరణ దినోత్సవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గత సంవత్సరం ఇదే తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించడాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అదే రోజున సోనియా గాంధీ జన్మదినం కావడం తమకు, కేబినెట్ సహచరులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆమె 79వ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతాభావంతో ఆమె సేవలను స్మరించాలన్నారు.

సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి, ఎన్నో ఒత్తిడులు, సవాళ్లు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యపరచిన నాయకురాలు ఆమె. మన్‌మోహన్ సింగ్ విలక్షణ దూరదృష్టి, సోనియా గాంధీ ఆశయాలు మా పాలనలో, సంక్షేమ కార్యక్రమాల్లో, రాష్ట్రాభివృద్ధి దిశలో ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.