Let's talk: editor@tmv.in
సోనియాగాంధీకి సెషన్స్ కోర్టు నోటీసులు

సోనియాగాంధీకి సెషన్స్ కోర్టు నోటీసులు

Pinjari Chand
10 డిసెంబర్, 2025

1980-81 ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరును ఎటువంటి పత్రాలు లేకుండా నమోదు చేశారని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదును మెజిస్ట్రేట్ కోర్టు రద్దు చేసిన నిర్ణయంపై, రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టులో దాఖలైన రివిజన్ పిటిషన్ విచారణలో సోనియా గాంధీకి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. సెషన్స్ జడ్జి విషాల్ గోగ్నే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రివిజనర్ వికాస్ త్రిపాఠి తరఫున సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ వాదనలు వినిపించారు.

నారంగ్ వాదనల్లో కీలకాంశాలు:

• సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే, 1980 ఎన్నికల జాబితాలో ఆమె పేరు చేర్చినట్లు ఆరోపణ

• దీనికి అవసరమైన పత్రాలు నకిలీ/తారుమారు చేసేందుకు అవకాశం ఉందని వాదన

• ఆమె పేరు తొలగింపు—తర్వాత 1983 లో తిరిగి చేర్చారు. రెండూ కూడా పౌరసత్వం పొందకముందే జరిగాయని ఆరోపణ

ఎన్నికల జాబితాలో పేరు నమోదు భారత పౌరులకు మాత్రమే అనుమతించనున్న ప్రజాప్రాతినిధ్య చట్టానికి ఇది వ్యతిరేకమని అభిప్రాయం. మొదట ఫిర్యాదులో కేవలం పత్రికా కట్టింగ్ క్లిప్పింగ్స్ ఆధారంగా వాదనలు వినిపించారని మెజిస్ట్రేట్ పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ధృవీకరించిన పత్రాలను సమర్పించినట్లు నారంగ్ తెలిపారు. వివాదాస్పద అంశాలను పరిశీలించేందుకు ట్రయల్ కోర్టు రికార్డులు (టీసీఆర్) కూడా తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రం తరఫున ప్రాసిక్యూటర్ నోటీస్ స్వీకరించారు. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6కు వాయిదా పడింది.

రివిజన్ పిటిషన్‌కు కారణం

మెజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదును ప్రారంభ దశలోనే చట్టపరమైన ఆధారం లేదని అభిప్రాయపడి తిరస్కరించింది. పౌరసత్వం,ఎన్నికల జాబితా వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయని వ్యాఖ్యానించింది.

1983లో భారతీయ పౌరసత్వం

ఒక విదేశీయురాలు భారతీయుడితో వివాహం అయ్యాక పౌరసత్వం పొందడానికి కనీసం 7 సంవత్సరాల ఇక్కడ నివసించాకే ఓటు హక్కును పొందవచ్చు. సొనియా గాంధీకి 1968లో రాజీవ్ గాంధీతో వివాహామైంది. అనంతరం ఇక్కడే స్థిరపడ్డారు. అయితే ఆమె 1983 ఏప్రిల్ 30న భారతీయ పౌరసత్వ సర్టిఫికెట్ ను పొందారు.

పౌరసత్వం పొందిన తర్వాతే ఓటు వేశారు: ప్రియాంక గాంధీ

తన తల్లి సోనియా గాంధీపై 1980-81 ఎన్నికల జాబితాలో పౌరసత్వం పొందకముందే పేరు నమోదు అయ్యిందన్న ఆరోపణలను పూర్తిగా కొట్టి పారేశారు. అది పూర్తిగా అబద్ధం అని ఆమె అన్నారు. వాళ్ల దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇది పూర్తిగా అబద్ధం. ఆమె భారతీయ పౌరురాలైన తర్వాతే ఓటు వేశారు. ఆమె 80 ఏళ్లకు చేరుకుంటోంది. జీవితాన్ని దేశసేవకే అంకితమిచ్చింది. ఇప్పుడు అయినా ఆమెను ప్రశాంతంగా వదిలేయాలి అని వ్యాఖ్యానించారు.

సోనియాగాంధీకి సెషన్స్ కోర్టు నోటీసులు - Tholi Paluku