Let's talk: editor@tmv.in
సోనం వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు – జైలు నుంచి విడుదల

సోనం వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు – జైలు నుంచి విడుదల

Pinjari Chand
15 మార్చి, 2026

పర్యావరణ కార్యకర్త, శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌పై విధించిన నిర్బంధాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం తక్షణ ప్రభావంతో రద్దు చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన విడుదలయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 24న లేహ్‌లో లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, అలాగే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కింద రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, 45 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 26న లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎస్‌ఏ) కింద వాంగ్‌చుక్‌ను నిర్బంధించారు. అనంతరం ఆయనను జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు.

ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పి అన్ని వర్గాలతో నిర్మాణాత్మక సంభాషణ జరిపే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లడఖ్ ప్రజల ఆశయాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వివిధ వర్గాల నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న బంద్‌లు, నిరసనలు విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారాలు, పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో సంభాషణల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్ర నిర్ణయం అనంతరం వాంగ్‌చుక్ శనివారం మధ్యాహ్నం జోధ్‌పూర్ జైలులో నుంచి విడుదలయ్యారు. ఆయన భార్య గీతాంజలి జే అంగ్మో విడుదల ప్రక్రియలను పూర్తి చేశారు.

వాంగ్‌చుక్ విడుదలపై లడఖ్ నాయకుల స్పందనలు

ఇదిలా ఉండగా, వాంగ్‌చుక్ విడుదలను లడఖ్ ఎంపీ మహ్మద్‌ హనీఫా, పీడీపీ పార్టీ నాయకురాలు మోహబుబా ముఫ్తీ స్వాగతించారు. అయితే నిరసనల్లో పాల్గొన్న ఇతరులను కూడా విడుదల చేయాలని, వారి మీద నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా వాంగ్‌చుక్‌ను నిర్బంధించారని అన్నారు. దేశానికి జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రవేత్తను అరెస్ట్ చేయడం తగదని అన్నారు. వాంగ్‌చుక్ జైలులో గడిపిన నెలలు ఆయనకు మాత్రమే కాకుండా దేశానికీ నష్టమని పేర్కొన్నారు. ఈ నియంతృత్వ ధోరణిని తప్పక ఎదిరించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత శశిథరూర్‌‌ కూడా విడుదలను స్వాగతిస్తూ విచారణ లేకుండా దీర్ఘకాల నిర్బంధం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని వ్యాఖ్యానించారు. విచారణ లేకుండా ఎంతకాలం నిర్బంధంలో ఉంచవచ్చో గరిష్ట పరిమితిని నిర్ణయించే కఠిన నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు

పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ విడుదలను లడఖ్ నాయకులు స్వాగతించారు. అయితే నిరసనల సందర్భంగా అరెస్టైన మిగతా వ్యక్తులను కూడా విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లడఖ్ ఎంపీ హనీఫా మాట్లాడుతూ వాంగ్‌చుక్ విడుదలను స్వాగతిస్తున్నామని, కానీ నిరసనల్లో పాల్గొన్న ఇతరులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగ హక్కు అని పేర్కొంటూ సమస్యలను సంభాషణల ద్వారా పరిష్కరించాలని ఆయన సూచించారు. లేహ్ ఏపెక్స్ బాడీ వాంగ్‌చుక్ విడుదలను ‘లడఖ్ ప్రజల పెద్ద విజయంగా’ అభివర్ణించింది. సహాధ్యక్షుడు చేరింగ్‌ దోర్జే మాట్లాడుతూ వాంగ్‌చుక్‌పై మోపిన దేశద్రోహ ఆరోపణలు ఆధారరహితమని మొదటి నుంచే చెప్పామని, ఈ నిర్ణయంతో లడఖ్ ప్రజల గౌరవం నిలపడిందని అన్నారు. కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ సభ్యుడు సజ్జద్‌ కర్గిలి కూడా వాంగ్‌చుక్ విడుదలను స్వాగతించారు. అయితే ఇంకా నిర్బంధంలో ఉన్న డెల్డన్ నాంగ్యాల్, స్మాన్లా డోర్జేలను వెంటనే విడుదల చేయాలని, నిరసనల్లో పాల్గొన్న వారిపై ఉన్న కేసులను షరతుల్లేకుండా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్చి 16న లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో నిర్వహించాలనుకున్న నిరసన ర్యాలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెరింగ్ డోర్జే తెలిపారు. అలాగే మిగతా ఇద్దరు నిర్బంధిత నాయకులకు మార్చి 23న కోర్టు విచారణలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.

కొంతమంది వ్యక్తులు రాష్ట్ర హోదా, సిక్స్ షెడ్యూల్ డిమాండ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ప్రజల్లో విభేదాలు సృష్టించేందుకు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అయితే లడఖ్ ప్రజలు నిజంగా తమ తరఫున మాట్లాడేవారు ఎవరో తెలుసుకుని ఉన్నారని ఆయన అన్నారు.

నిరసనలు, హింసకు స్థానం లేదు: లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్

పర్యావరణ కార్యకర్త వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌ కుమార్‌‌ సక్సేనా స్వాగతించారు. అయితే కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు, బంద్‌లు, హింసకు స్థానం లేదని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి సంభాషణ, పరస్పర అవగాహన మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. నిరసనలు, బంద్‌లు, హింసాత్మక చర్యలు శాశ్వత పరిష్కారానికి దోహదపడవని ఆయన పేర్కొన్నారు. లడఖ్ ప్రజల సహకారంతో కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతి కొనసాగి అభివృద్ధి వేగవంతం అవుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.