Let's talk: editor@tmv.in
సోదరి పెట్టిన చిచ్చు

సోదరి పెట్టిన చిచ్చు

FL - TRND
28 సెప్టెంబర్, 2025

బీహార్ రాజకీయాల్లో లాలూ కుటుంబ అంతర్గత వివాదం మళ్లీ బహిరంగమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలలే మిగిలి ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన ఆర్‌జేడీ కుటుంబంలోని విభేదాలను బయటపెట్టాయి. 2022లో ఆమె తన తండ్రికి సింగపూర్‌లో కిడ్నీ డొనేషన్ ఇచ్చినట్లు ప్రకటించగా, ఇప్పుడు దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల వెనుక తేజస్వీ యాదవ్ స్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ పాత్ర ఉందని రోహిణి పరోక్షంగా ఆరోపించగా, పెద్ద అన్నయ్య తేజ ప్రతాప్ యాదవ్ ఆమెకు బహిరంగ మద్దతు ఇచ్చారు.

రోహిణి ఆచార్య ఇటీవల లాలూ, తేజస్వీ, తేజ ప్రతాప్, ఆర్‌జేడీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. తన పోస్టుల్లో సెల్ఫ్‌ రెస్పెక్ట్, కుటుంబ గౌరవం గురించి రాశారు. పార్టీ వర్గాలపై నిప్పులు చెరిగారు. ఆమె కిడ్నీ దానం చేయలేదనే పుకార్లను వ్యతిరేకిస్తూ, ఎవరైనా ఈ ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయాలు మాత్రమే కాకుండా ప్రజా జీవితం నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాలు విసిరారు. అదే సమయంలో, తప్పుడు ప్రచారం చేస్తున్నవారు తనకే కాకుండా దేశంలోని ప్రతి స్త్రీకి క్షమాపణ చెప్పాలని, మళ్లీ ఇలాంటి దూషణలు చేయబోమని హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ వివాదంలో తేజ ప్రతాప్ యాదవ్ గట్టిగా రోహిణి పక్షం పట్టారు. 'అక్క చేసిన త్యాగం ఏ కూతురు, చెల్లెలు, తల్లి చేయలేని స్థాయిలో ఉంది' అంటూ ఆమెను ప్రశంసించారు. తన అక్కను అవమానించే వారెవ్వరైనా ఉంటే, కృష్ణుడి సుదర్శన చక్రం వారిపై పడుతుందని కూడా హెచ్చరించారు. తేజ ప్రతాప్ ఇప్పటికే కుటుంబం, పార్టీ నుంచి దూరమై కొత్త పార్టీ జ‌నశ‌క్తి జ‌నతా ద‌ల్‌లో చేరారు. మహువ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక రోహిణి మరోవైపు, తనకు అసెంబ్లీ టికెట్ కావాలన్న కోరిక లేదని, రాజ్యసభ ఆశలూ లేవని, ఎప్పుడూ లేవని స్పష్టంచేశారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, కుటుంబ గౌరవం తనకెంతో ముఖ్యమని చెప్పారు.

ఇక సంజయ్ యాదవ్ పార్టీపై పెంచుకుంటున్న ప్రభావం కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం రేపుతోందని వర్గాలు చెబుతున్నాయి. ఆయన్ను తేజ ప్రతాప్ 'జైచంద్' అని పిలిచిన విషయం గుర్తుంచుకోవాలి. సారన్ లోకసభ ఎన్నికల్లో ఓడిపోయిన రోహిణి ఇప్పుడు మళ్లీ కుటుంబ అంతర్గత విభేదాల మధ్య నిలబడటంతో ఆర్‌జేడీ లోపలి అసంతృప్తి బహిరంగమైంది. ఇదంతా కలిసి బీహార్ ఎన్నికల ముందు ఆర్‌జేడీకి పెద్ద ఇబ్బంది తీసుకొచ్చే అవకాశముంది. లాలూ కుటుంబం బలహీనతలను ప్రత్యర్థి జేడీయూ-బీజేపీ కలయిక ఒక శక్తివంతమైన ఆయుధంలా ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కుటుంబంలో చీలికలు, సీనియర్ నాయకుల పక్కకు నెట్టివేత, కొత్త ముఖాలకు పెరుగుతున్న ప్రాధాన్యం లాంటివి ఆర్‌జేడీకి ఎన్నికల వాతావరణంలో ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ వివాదం ఎంతవరకు విస్తరిస్తుందో అనేదానిపై ఆర్‌జేడీ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

సోదరి పెట్టిన చిచ్చు - Tholi Paluku