
సొంతజిల్లాలో వైయస్ జగన్ పర్యటన
మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన సొంత జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. అక్కడ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.
స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైయస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
గోడు వెల్లబోసుకున్న రైతులు
వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని వారికి అండగా ఉంటామని వైయస్ జగన్ అన్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేశారు.
బుధవారం ఉదయం 9గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. టన్ను అరటి ధర 25 వేల నుంచి 2 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ధరల్లేక అరటి రైతులు అవస్థలు పడుతున్నారు.వారిని పలకరించి,వారి సమస్యలు తెలుసుకుంటారు.
అక్కడినుంచి పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు
