Let's talk: editor@tmv.in
‘సైబర్ వారియర్స్’గా ఎన్సీసీ క్యాడెట్లు

‘సైబర్ వారియర్స్’గా ఎన్సీసీ క్యాడెట్లు

Pinjari Chand
4 జనవరి, 2026

జాతీయ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) సహజ విపత్తుల సమయంలో తొలి స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) పని చేసేలా లక్ష మంది క్యాడెట్లకు శిక్షణ ఇవ్వాలని, అలాగే దేశ డిజిటల్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా 10,000 మంది ‘సైబర్ వారియర్స్’ను తయారు చేయాలని ప్రణాళిక రూపొందించిందని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ శనివారం తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో డిసెంబర్ 30న ప్రారంభమైన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్–2026 సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.2026 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలిసారిగా ఎన్సీసీ పరేడ్, కాంటింజెంట్ కమాండర్లు ఖడ్గంతో చేయనున్నారని, ఇది సైనిక కాంటింజెంట్లకు సమానంగా ఉంటుందని ఆయన తెలిపారు.

డ్రోన్, కౌంటర్-డ్రోన్ శిక్షణ కేంద్రాలు

దేశవ్యాప్తంగా 4 నుంచి 5 హబ్‌లను ఏర్పాటు చేసి, ఎంపికైన ఎన్సీసీ క్యాడెట్లకు డ్రోన్, కౌంటర్-డ్రోన్ అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ ఏడాది క్యాంప్‌లో దేశవ్యాప్తంగా 2,406 మంది ఎన్సీసీ క్యాడెట్లు (వారిలో 898 మంది బాలికలు) పాల్గొంటున్నారు.

అలాగే భూటాన్, శ్రీలంక, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా తదితర 20కి పైగా స్నేహపూర్వక విదేశాల నుంచి 200 మందికి పైగా క్యాడెట్లు కూడా పాల్గొంటున్నారు.

నెలరోజుల పాటు సాగే ఈ క్యాంప్‌లో

• ఉత్తమ క్యాడెట్ పోటీ

• స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్

• కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మార్చింగ్, ఫ్లాగ్ ఏరియా డిజైనింగ్ వంటి అనేక అంతర్-డైరెక్టరేట్ పోటీలు నిర్వహించనున్నారు. ఈసారి జమ్మూ కశ్మీర్, లడఖ్ నుంచి 127 మంది, అలాగే ఈశాన్య భారత ప్రాంతం నుంచి 131 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.

ఎన్సీసీ క్యాడెట్ల సంఖ్య పెంపు

ప్రస్తుతం 17 లక్షలుగా ఉన్న ఎన్సీసీ బలాన్ని 20 లక్షలకు పెంచాలని, దీనిని 2028 నాటికి దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లెఫ్ట్. జనరల్ వీరేంద్ర వాట్స్ చెప్పారు. ప్రస్తుతం మొత్తం బలగాల్లో 40 శాతం బాలిక క్యాడెట్లే ఉన్నారని తెలిపారు.

‘యువ ఆపద మిత్ర’ పథకం

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఎ)తో కలిసి లక్ష మంది క్యాడెట్లను విపత్తుల సమయంలో తొలి స్పందనకారులుగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరిని ‘యువ ఆపద మిత్రలు’గా పిలుస్తారు. వారిని జాతీయ డేటాబేస్‌తో అనుసంధానం చేసి, అవసరమైనప్పుడు దేశం వినియోగించుకునేలా చేస్తామని ఆయన చెప్పారు.

డిజిటల్ ఢిపెన్స్ గోడలా

సైబర్ రంగం వేగంగా ఆయుధీకృతమవుతున్న(ఒక రంగాన్ని ఆయుధంలా మార్చి దాడులకు ఉపయోగించడం) నేపథ్యంలో, డిజిటల్ డిఫెన్స్ గోడలా నిలిచే 10,000 మంది సైబర్ వారియర్స్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వీరినీ జాతీయ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు.

ప్రముఖులతో క్యాడెట్ల సమావేశం

ఈ క్యాంప్‌ను సోమవారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అధికారికంగా ప్రారంభిస్తారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మూడు దళాల అధిపతులు, అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) సందర్శించిన తొలి భారతీయుడైన ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా పలువురు సైనిక నాయకులు క్యాడెట్లతో ఈ నెలలో పరస్పరం మాట్లాడనున్నారు.

ప్రధాని ర్యాలీ తేదీ మార్పు

ప్రతి ఏడాది జనవరి 27న జరిగే ప్రధాని ర్యాలీ, ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరి 28న నిర్వహించనున్నట్లు ఎన్సీసీ డీజీ తెలిపారు. అండమాన్–నికోబార్ దీవుల్లో జరిగిన సేలింగ్ ఎక్స్‌పెడిషన్‌లో ఎన్సీసీ క్యాడెట్లు సేకరించిన మట్టిని ఒక కలశంలో ఉంచి, ఆ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీకి అందజేయనున్నారు. లక్షద్వీప్‌లో నిర్వహించిన రన్నింగ్-కమ్-సేలింగ్ ఎక్స్‌పెడిషన్, మూడు సైక్లోథాన్‌లు సహా ఐదు విభిన్న ఎక్స్‌పెడిషన్లను ప్రధాని అధికారికంగా ముగింపు పలకనున్నారు.

‘సైబర్ వారియర్స్’గా ఎన్సీసీ క్యాడెట్లు - Tholi Paluku