Let's talk: editor@tmv.in
సైబర్ వలలో జనసేన ఎమ్మెల్యే.. ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం

సైబర్ వలలో జనసేన ఎమ్మెల్యే.. ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం

Panthagani Anusha
23 మార్చి, 2026

రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మిన్నంటుతున్నాయి. సామాన్యులనే కాదు ఏకంగా ప్రజాప్రతినిధులనే లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. ఆర్‌టీఏ చలాన్ చెల్లింపు పేరుతో పంపిన ఒక నకిలీ లింక్, పోలవరం జనసేన ఎమ్మెల్యే సి. బాలరాజును నిలువునా ముంచింది. ఆయన మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసిన దుండగులు, క్షణాల వ్యవధిలోనే ఖాతా నుంచి రూ.12 లక్షల నగదును కాజేశారు.

పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్యే బాలరాజు మొబైల్‌కు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) పేరుతో ఒక సందేశం వచ్చింది. అందులో వాహనానికి సంబంధించి చలాన్ పెండింగ్‌లో ఉందని వెంటనే చెల్లించాలంటూ ఒక లింక్‌ను పంపారు. అది నిజమైన సందేశమేనని నమ్మిన ఎమ్మెల్యే, ఆ లింక్‌ను క్లిక్ చేశారు. దీంతో ఆయన ఫోన్‌లో ఒక ప్రమాదకరమైన ఏపికే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్ డౌన్‌లోడ్ అయ్యింది. కాగా ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ఎమ్మెల్యే ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించిన హ్యాకర్లు ఆయన బ్యాంకు వివరాలు, ఓటీపీలను సులువుగా సేకరించి, నిమిషాల వ్యవధిలో రూ.12 లక్షలను అక్రమంగా బదిలీ చేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నగదు విత్‌డ్రా

అయితే తన ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు డెబిట్ అయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమయ్యారు. తొలుత నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఫిర్యాదును మార్చి 21న స్థానిక పోలీస్ స్టేషన్‌కు పంపించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల పరిశీలనలో, దొంగిలించిన డబ్బును పశ్చిమ బెంగాల్‌లోని ఒక ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీని వెనుక అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉండొచ్చని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 318(4)తో పాటు సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 66డీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌టీఏ చలాన్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే అపరిచిత లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని లింక్‌ల ద్వారా డౌన్‌లోడ్ అయ్యే యాప్‌లు మన ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఆర్థికంగా నష్టపరుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.