Let's talk: editor@tmv.in
సైబర్ నేరాల కేసుల్లో ఖాతాల ఫ్రీజ్‌పై సుప్రీంకోర్టు జోక్యం

సైబర్ నేరాల కేసుల్లో ఖాతాల ఫ్రీజ్‌పై సుప్రీంకోర్టు జోక్యం

Pinjari Chand
19 జనవరి, 2026

సైబర్ నేరాల దర్యాప్తు సందర్భంగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, తిరిగి డీ-ఫ్రీజ్ చేయడంపై ఒకే విధమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ముందుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు పంకజ్ మిత్తల్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం, ఈ అంశం ఇప్పటికే సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందు డిజిటల్ అరెస్టులపై స్వయంచాలకంగా (సూమోటో) తీసుకున్న కేసులో పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజిస్ట్రీ, ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు తీసుకొని తగిన బెంచ్ ముందు కేసును లిస్ట్ చేయాలని కోర్టు పేర్కొంది.

పిటిషన్‌లోని ప్రధాన డిమాండ్లు

• రాతపూర్వక, కారణాలతో కూడిన ఉత్తర్వు లేకుండా ఎలాంటి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయకూడదు

• ఖాతా ఫ్రీజ్ చేసిన 24 గంటల్లో ఖాతాదారుడికి సమాచారం ఇవ్వాలి

• ఖాతా ఫ్రీజ్ చేసిన విషయాన్ని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 106(3) / సీఆర్పీసీ సెక్షన్ 102(3) ప్రకారం వెంటనే న్యాయమూర్తికి నివేదించాలి

• దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఒకే విధమైన ఎస్వోపీ రూపొందించాలి

పిటిషనర్ వాదన

పిటిషనర్ వివేక్ వర్ష్నీ తన బ్యాంకు ఖాతాలను తమిళనాడు సైబర్ సెల్ అధికారులు ముందస్తు నోటీసు లేకుండా ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. దీనివల్ల తన జీవనోపాధి, వ్యక్తిగత అవసరాలు, పన్నుల చెల్లింపులు కూడా నిలిచిపోయాయని తెలిపారు. ఇది ఆర్టికల్స్ 19(1)(జీ), 21 కింద తన మౌలిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. సైబర్ నేరాల పేరుతో ఖాతాలను యథేచ్ఛగా ఫ్రీజ్ చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఖాతాదారు నేరంలో భాగస్వామి అని నిరూపితమయ్యే వరకు మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకూడదని పిటిషన్‌లో కోరారు.

కోర్టు పరిశీలన

ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య పౌరులను అనవసర వేధింపుల నుంచి రక్షించేందుకు మార్గదర్శకాలు అవసరమని పిటిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీజేఐ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.