Let's talk: editor@tmv.in
సైబర్‌ కేటుగాళ్లకు చెక్‌ పెట్టండి: బ్యాంకర్లకు సజ్జనార్‌ పిలుపు

సైబర్‌ కేటుగాళ్లకు చెక్‌ పెట్టండి: బ్యాంకర్లకు సజ్జనార్‌ పిలుపు

Sirisha B
1 ఏప్రిల్, 2026

సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో ప్రజల కష్టార్జిత సంపాదనను రక్షించడంలో బ్యాంకు ఉద్యోగుల బాధ్యత అత్యంత ముఖ్యమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులైన బ్యాంకర్లు తమ కస్టమర్ల లావాదేవీలను పరిశీలిస్తూ, వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గుర్తించిన వెంటనే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

డిజిటల్ అరెస్టులు- పెట్టుబడి మోసాలు పెరుగుదల

ఇటీవలి కాలంలో 'డిజిటల్ అరెస్టులు' లేదా 'పెట్టుబడి మోసాల బారిన పడుతున్న బాధితులు.. సైబర్ ముఠాల ఒత్తిడితో తమ డిపాజిట్లను హుటాహుటిన విత్‌డ్రా చేయడం లేదా బంగారంపై తక్షణమే రుణాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారని సీపీ వివరించారు. అటువంటి సమయాల్లో కస్టమర్ల ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు, ఆందోళన లేదా భయం కనిపిస్తే, బ్యాంకర్లు వెంటనే స్పందించి వారిని ఆరా తీయాలని సూచించారు.

వృద్ధులు-పెన్షనర్లను మోసగాళ్ల నుంచి కాపాడాలి

ముఖ్యంగా పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను మోసగాళ్ల మాయలో పడి పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలను గమనించినట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి, లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి చైతన్యవంతులైనప్పుడే 'సైబర్ నేర రహిత సమాజ నిర్మాణం' సాధ్యమవుతుందని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బాధితులు మోసపోయిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

సైబర్‌ కేటుగాళ్లకు చెక్‌ పెట్టండి: బ్యాంకర్లకు సజ్జనార్‌ పిలుపు - Tholi Paluku