Let's talk: editor@tmv.in
సైబరాబాద్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ పటిష్టం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

సైబరాబాద్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ పటిష్టం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరు సర్కిల్-46లో ఘన వ్యర్థాల నిర్వహణ తీరును కమిషనర్ జి. సృజన స్వయంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చెత్తను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయకుండా, బహిరంగంగా తగులబెడుతున్నట్లు గుర్తించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

చెత్తను తగులబెట్టడం వంటి పర్యావరణ విఘాతక చర్యలపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఘటనా స్థలాన్ని ఏఎస్ఐ సందర్శించి పరిశీలించారు. ఈ అక్రమాలకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎల్ఏ సమీపంలోని పారిశ్రామిక యూనిట్లు వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించి, వాటికి హెచ్చరికలు జారీ చేశారు.

వ్యర్థాల నిర్వహణలో అన్ని స్థాయిల్లో అధికారులను జవాబుదారీగా చేయాలని, నిర్లక్ష్యం వహించే వారిని గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు. ఐఏఎల్ఏ పరిధిలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జోనల్ బృందానికి సూచించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్ 2026 ప్రకారం.. వ్యర్థాల విభజన, శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయడం తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. సైబరాబాద్‌ను పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చడానికి 100 శాతం నిబంధనల అమలుకు సీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ వెల్లడించారు.