
సైన్స్ బెలూన్లు తాకరాదు: టిఐఎఫ్ఆర్ హెచ్చరిక
హైదరాబాద్ నుంచి ప్రయోగించే సైన్స్ పరిశోధన బెలూన్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ఆర్) సంస్థ హెచ్చరించింది. భారత అణు శక్తి శాఖ, ఇస్రో పర్యవేక్షణలో టిఐఎఫ్ఆర్ సంస్థ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 10 సైన్స్ బెలూన్లను ప్రయోగిస్తోంది. కాగా గాలి దిశల ఆధారంగా ఈ బెలూన్లు వాటితో కూడిన పరిశోధన పరికరాలు విశాఖపట్నం,హైదరాబాద్,సోలాపూర్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అయితే బెలూన్లు సుమారు 42 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని తర్వాత పరిశోధన పరికరాలు పారాచ్యూట్‌లతో భూమికి తిరిగి వస్తాయి. ఈ పరికరాలు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, విజయనగరం వంటి వివిధ జిల్లాల్లో పడవచ్చు. టిఐఎఫ్ఆర్ ప్రకటన ప్రకారం ఈ పరిశోధన పరికరాలు చాలా సున్నితమైనవి వాటిని తాకడం లేదా తెరవడం ప్రమాదకరం కావచ్చు అని తెలిపింది.
ఒకవేళ ప్రజలు ఈ పరికరాలను గుర్తిస్తే వాటిని తాకకుండా తక్షణం దగ్గరలోని పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేదా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి. శాస్త్రవేత్తలు వాటిని తిరిగి తీసుకుని, వాటి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వాళ్లకు వ్యక్తులకు బహుమతులు అందిస్తామని స్పష్టం చేసింది అయితే ఎవరైనా పరికరాలను తెరవడానికి లేదా తాకడానికి ప్రయత్నిస్తే వారికి బహుమతి ఇవ్వడం జరగదు అని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇక సైన్స్ బెలూన్ల ప్రయోజనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవి వాతావరణ పరిశీలన, అంతరిక్ష అధ్యయనం, భూమి-వాతావరణ మార్పుల అధ్యయనం కోసం ఉపయోగపడతాయి. 42 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరి, ఉష్ణోగ్రత, గాలి ఒత్తిడి, వర్షపాతం, గాలి దిశ వంటి వాతావరణ సమాచారాన్ని సేకరిస్తాయి. అంతేకాక రేడియేషన్, సౌర కిరణాలు, ఖగోళ సంబంధిత పరిశోధనలు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సైన్స్ బెలూన్లు తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తులో ప్రయోగాలు చేయడానికి, శాస్త్రీయ పరికరాలను పరీక్షించడానికి భవిష్యత్తులో ఉపగ్రహాలు లేదా ఇతర అంతరిక్ష పరికరాలకు ముందస్తు డేటా సేకరించడానికి సహాయపడతాయి. అయితే వీటిలో హైడ్రోజన్ గ్యాస్ ఉండటంతో, పరికరాలను తాకడం/తెరవడం వల్ల ప్రమాదం కలగవచ్చు. ఇందుకు గాను ప్రజలు వీటిని తాకకుండా గుర్తించిన వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం అత్యవసరం.
మొత్తంగా సైన్స్ బెలూన్లు భూమి,అంతరిక్షం మధ్య జరుగుతున్న మార్పులను తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలకు విలువైన డేటా అందించడానికి ఉపయోగపడే ముఖ్యమైన పరిశోధనా పరికరాలు. ప్రజలు జాగ్రత్తగా ఉండి, బెలూన్లను తాకకపోవడం ద్వారా పరిశోధనలకు సహకారం అందించవచ్చు.
