
సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు: రాజ్‌నాథ్ సింగ్
బీహార్‌లో ఎన్నికల ర్యాలీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సైన్యానికి ఒక్క మతమే ఉంది, అది ‘సైన్య ధర్మం’. ఆ సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని హెచ్చరించారు. మేం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. కానీ ఆర్మీకి మతం, కులం లేదు. దేశం ఎప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొన్నా, మా సైనికులు తమ పరాక్రమంతో భారత గౌరవాన్ని నిలబెట్టారు. కులం, మతం ఆధారంగా చేసే రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయన్నారు. అలాగే ఆయన ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తావించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్ లోని ప్రధాన ఉగ్ర స్థావరాలు పూర్తిగా నాశనం చేశామని చెప్పారు. ప్రధాన ఉగ్రశిబిరాలను మట్టుబెట్టాం. అది ఇంకా ముగియలేదు. తాత్కాలికంగా నిలిపివేశాం. మళ్లీ ప్రారంభిస్తాం అని తెలిపారు. భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు. ప్రపంచం భారత్ వైపు గౌరవంగా చూస్తోందన్నారు.
సైన్యాన్ని కులమతాల కళ్లజోడుతో చూడడం అవమానం: చిరాగ్ పాశ్వాన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత సైన్యంపై చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. ఆయన రాహుల్ వ్యాఖ్యలను అవమానకరమైనవి, దౌర్భాగ్యకరమైనవి అని అభివర్ణించారు. సైన్యం ఒక జాతి గౌరవానికి చిహ్నం. దానిని రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సైనికులను అవమానపరచేవి. ఇది సిగ్గుచేటే కాదు దేశానికి కూడా దురదృష్టకరం. మీరు అంతగా ఆందోళన చెందుతున్నారా? అయితే దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ఎవరు? మీరు, మీ కుటుంబమే కదా! అప్పుడు సైన్యాన్ని కులాలవారీగా విభజించి ఉండేవారు కదా? అని విమర్శించారు.
పదిశాతం మందే అన్ని వ్యవస్థలను నియంత్రిస్తున్నారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లోని కుటుంబలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ దేశంలో 10 శాతం ప్రజలే సైన్యం, న్యాయవ్యవస్థ, బ్యాంకులు, పెద్ద కంపెనీలు వంటి కీలక రంగాలను నియంత్రిస్తున్నాయని అన్నారు. భారతదేశ జనాభాలో 90 శాతం మంది దళితులు, వెనుకబడినవారు, గిరిజనులు, మైనార్టీలే. కానీ దేశంలోని 500 పెద్ద కంపెనీల్లో, బ్యాంకుల్లో, న్యాయవ్యవస్థలో వారికి స్థానం లేదు. ఆ సంస్థలన్నీ 10 శాతం మందే నియంత్రిస్తున్నారు అని ఆరోపించారు. అదే సందర్భంలో ఆయన అంబానీ, ఆదానీల గురించి ప్రస్తావిస్తూ దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఈ 10 శాతం ఉన్న వర్గాలు దేశ సంపద, ఉద్యోగాలు, సైన్యం అన్నింటినీ బంధించేశారని అన్నారు.
