
సైనా నెహ్వాల్‌కు 'భవ్య భారత భూషణ్' పురస్కారం
తమిళనాడులోని కోయంబత్తూరు వేదికగా భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈశా యోగా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆమె 'భవ్య భారత భూషణ్' పురస్కారాన్ని అందుకున్నారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సైనాతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ అవార్డుతో సత్కరించారు.
పురస్కారాన్ని అందుకున్న అనంతరం సైనా నెహ్వాల్ మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇంతటి భారీ జనసమూహం మధ్య పురస్కారాన్ని అందుకోవడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఈ గౌరవాన్ని అందించిన సద్గురుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రశాంతత, సానుకూల దృక్పథం తనకు ఎంతో ఇష్టమని, రక్షణ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం తన జీవితంలో అత్యంత గర్వకారణమైన రోజుగా నిలిచిపోతుందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్తులో క్రీడాకారులకు, ఇతర రంగాల వారికి ఇలాంటి గుర్తింపులు మరిన్ని లభించాలని ఆమె ఆకాంక్షించారు.
మరోవైపు, గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న సైనా నెహ్వాల్.. ఈ ఏడాది జనవరి 20న తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ధ్రువీకరించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆమె, ఇకపై పోటీ క్రీడల్లో కొనసాగలేనని స్పష్టం చేశారు. తాను క్రీడలోకి తన ఇష్టప్రకారం అడుగుపెట్టానని, అలాగే తప్పుకుంటున్నానని, అందుకే దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదని భావించినట్లు సైనా గతంలో ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. మోకాలి చిప్పలు దెబ్బతినడం వల్ల కఠినమైన శిక్షణ తీసుకోవడం తన శరీరానికి సాధ్యపడటం లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి పేర్కొన్నారు.
