
సేవా, త్యాగమే భారత్ ను అగ్రగామిగా నిలుపుతాయి
సేవా త్యాగాలే దేశాన్ని అగ్రగామిగా నిలుపుతాయని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిలభారత ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస బలే అన్నారు
ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సేవా విభాగాల్లో ఒకటిగా విశాఖలో 50 ఏళ్ల పాటు నిస్వార్ధంగా వైద్యసేవలందిస్తోన్న. వివేకానంద మెడికల్ ట్రస్ట్ వారి వివేకానంద డయాగ్నోస్టిక్స్& రీసెర్చ్ సెంటర్ అత్యాధునిక ఆసుపత్రి భవనం శనివారం ఉదయం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన చేతుల మీదగా ప్రారంభమైంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్.ఎస్.ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే హాజరుకాగా గౌరవ అతిధిగా ఆర్.ఎస్.ఎస్.సహక్షేత్ర సంచాలక్ దూసి రామకృష్ణ, స్ధలదాత ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆర్.ఎస్.ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ, నిస్వార్ధ సేవాసంస్ధగా 5 దశాబ్దాలుగా వివేకానంద మెడికల్ ట్రస్ట్ సేవలందిస్తూ వచ్చిందని, ఒక సమున్నత లక్ష్యం వుంటబట్టే సుధీర్ఘకాలం సేవలందించడం సాధ్యమైందని పేర్కొన్నారు. నిస్వార్ధం సేవలందించే సంస్ధలే నేటి సమాజానికి అవసరమని ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా అదే బాటలో పయనిస్తుందని అన్నారు.
ఆర్.ఎస్.ఎస్ ఆశయం కేవలం పుణ్యం కోసం దానధర్మాలు చేయడం కాకాదని, సమాజానికి తిరిగి గలిగే మానవ వనరులను తయారు చేయడమని చెప్పారు. నైతికంగా, ఆధ్యాత్మికంగా, సంస్కృతికంగా సమాజాన్ని పునరుద్దరింపజేయాలని, సేవ , త్యాగం అన్నవి కవల పిల్లల లాంటివని చెప్పారు. ఆర్.ఎస్.ఎస్ భావజాలానికి పూర్తిస్ధాయిలో కట్టుబడి వున్న వ్యక్తి స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి అని, ఆయన, ఆయన సతీమణి ప్రొఫెసర్ శాంతమ్మ దాన గుణం ఎనలేనిదని, వారు ట్రస్ట్ కు అందజేసి చేసిన స్ధలంలో నిర్మాణమైన ఈ ఆసుపత్రి భవనం భావిష్యత్తులో ఆయన ఆశయాలు నిలబెట్టే రీతిలో సేవలందించాలని ఆకాంక్షించారు. స్వయం సేవకులు దేశవ్యాప్తం గా ఒక లక్ష సేవా ప్రాజెక్టులను చేపట్టారని, 28 రకాల సేవాకార్యక్రమాల ద్వారా దేశ ప్రగతికి దోహదపడుతున్నారని అన్నారు.
వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా నాణ్యమైన వైద్యం చౌకగా అందించాలని లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒక అదర్శ వైద్య పరిశోధనా అభివృద్ది సంస్ధగా భవిష్యత్తులో ఈ సంస్ధ సేవలు ఎంతో అవసరమని, విద్యాసంస్ధలు డిగ్రీలు ఇచ్చే సంస్ధలుగా మాత్రమే కాకుండా విలువలు నేర్పించాలని సూచించారు.
స్ధల దాత ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ మాట్లాడుతూ నోబెల్ బహుమతిపొందేస్ధాయికి వివేకానంద మెడికల్ ట్రస్ట్ తన వైద్య పరిశోధనా విభాగాన్ని అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు..కొలాబరేటివ్ అప్రోచ్ లో కూడా పరిశోధనలు కొనసాగాలని, హోమియోపతి లో రామన్ ఎఫెక్ట్ తో పరిశోధనలుచేస్తున్నారని ఇక్కడ కూడా అటువంటివి జరగాలని ఆకాంక్షించారు. వివేకానంద ట్రస్ట్ ఇచ్చిన డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఇక్కడ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ విభాగాలతో వైద్య సేవలకు ఇస్తామని ఎనిమిది పడకల ఆసుపత్రిగా ఇది ప్రారంభమవుతుందని చెప్పారు. పలు రకాల డయాగ్నస్టిక్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ క్షేత్ర సంఘచాలక్ దూసి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ చేతుల మీదుగా స్థలదాత ప్రొఫెసర్ శాంతమ్మతో పాటు వివేకానంద ట్రస్ట్ సభ్యులను సత్కరించారు.
